ఇద్దరికీ తినడం అంటే చాలా ఇష్టం:పరిణీతి చోప్రా
న్యూఢిల్లీ: నిజజీవితంలోనూ తాను తిండిబోతునని నిజాయతీగా ఒప్పుకునే పరిణీతి చోప్రాకు సరిపోయే సినిమానే దొరికింది! ఆదిత్యరాయ్ కపూర్‌కు జోడీగా 'దావత్ ఏ ఇష్క్'లో నటిస్తోంది పరిణీతి. ఇద్దరం తిండిబోతులం కాబట్టే షూటింగ్ సెట్లపైనే స్నేహితులమైపోయామని చెబుతోంది. హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతి హైదరాబాద్ యువతిగా కనిపించనుంది. కెబాబ్‌లు, బిర్యానీతో ఎంతటి వారినైనా కట్టిపడేసే బావర్చీగా ఆదిత్య నటిస్తున్నాడు. ‘నేను తిండిబోతును.ఆదిత్య నాతో పోటీ పడతాడని షూటింగ్ సమయంలోనే అర్థమయింది. మా ఇద్దరికీ తిండి అంటే చాలా ఇష్టం. ప్లేట్లకు ప్లేట్లు సెట్లపైనే లాగించే వాళ్లం. ఈ సినిమాలో నేను బాగా తినాలి. దీని కథ నాకోసమే రాశారేమో అనిపించింది’ అని వివరించింది.
దావత్ ఏ ఇష్క్ పాటల విడుదల కోసం ఢిల్లీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో పరిణీతి మాట్లాడుతూ ఈ సంగతులన్నీ చెప్పింది. హైదరాబాద్‌తోపాటు లక్నో, ముంబైలో సినిమా షూటింగ్ జరిగింది. లక్నో వంటకాల పుణ్యమాని ఆదిత్య, తాను విపరీతంగా బరువెక్కామంటూ ఈ 25 ఏళ్ల బ్యూటీ నవ్వేసింది. ‘మాతోపాటు అనుపమ్ ఖేర్ కూడా బాగా లాగించేవారు. ఆయన కొన్నాళ్లు లక్నోలోనూ ఉండడం వల్ల అక్కడి స్థానిక వంటకాలు, హోటళ్ల గురించి బాగా తెలుసు’ అని వివరించింది.