ఎదురులేకుండా దూసుకుపోతున్న 'ఎయిర్లిఫ్ట్'
ముంబై: వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఎమోషనల్ డ్రామాలకు వెండితెరపై ఆదరణ తగ్గలేదని 'ఎయిర్లిఫ్ట్' మరోసారి రుజువుచేసింది. 1990లో కువైట్ పై ఇరాక్ యుద్ధం సందర్భంలో అక్కడి భారతీయులను సురక్షితంగా తరలించే కథతో తెరకెక్కిన 'ఎయిర్లిఫ్ట్' సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ జంటగా ఈ నటించిన ఈ సినిమా కేవలం పదిరోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది. రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎయిర్లిఫ్ట్' జనవరి 22న ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలి వీకెండ్ లో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొట్టిన ఈ సినిమా రెండో వీకెండ్ లో రూ. 19.22 కోట్లు వసూలు చేసింది. దీంతో పదిరోజుల్లో ఈ సినిమా పదిరోజుల్లో 102.7 కోట్లు రాబట్టింది.
'ఎయిర్ లిఫ్ట్ సినిమా రూ. వందకోట్ల క్లబ్బులో చేరింది. మా అంచనాలకు తగ్గట్టు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్న ఈ సినిమా మున్ముందు మరింత మెరుగ్గా కలెక్షన్లు రాబడుతుందని ఆశిస్తున్నాం. ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇవ్వడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది' అని ఈ సినిమాను విడుదల చేసిన ప్రతీక్ ఎంటర్ టైన్మెంట్స్ చైర్మన్ ప్రశాంత తివారీ ఓ ప్రకటనలో తెలిపారు.
1990లో కువైట్‌పై ఇరాక్ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. అక్షయ్‌కుమార్ తన కెరీర్‌లో ఉత్తమ అభినయాన్ని ఈ సినిమాలో చూపించారని విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్ర అభిమానులను అలరిస్తోంది.