ఇప్పుడు నన్నంతా గోల్డెన్ లెగ్ అంటున్నారు!
ఒకే ఒక్క సినిమా చాలు... కెరీర్ టర్న్ కావడానికి. హంసానందిని విషయంలో అదే జరిగింది. వంశీ సినిమా ‘అనుమానాస్పదం’తో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన హంసానందినికి ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. కానీ, ‘ఈగ’లో చేసిన అతిథి పాత్ర ఆమె కెరీర్‌కి మంచి మలుపయ్యింది. ఆ తర్వాత ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్’ చిత్రాల్లో ఈ బ్యూటీ చేసిన అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘లౌక్యం’లో హంస అతిథి పాత్ర చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో నన్నందరూ ‘గోల్డెన్ లెగ్’ అంటున్నారని హంసా నందిని చెబుతూ -‘‘ ‘లౌక్యం’లో నా పాత్ర గురించి చెప్పి, బ్రహ్మానందంగారికి భార్యగా చేయాలని దర్శకుడు శ్రీవాస్ అన్నప్పుడు థ్రిల్ అయ్యాను. బ్రహ్మాజీ.. అదేనండీ.. బ్రహ్మానందంగారు ఎంత మంచి నటుడో తెలిసిందే. తాను నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్విస్తారు. ఇక, గోపీచంద్ అయితే చాలా కూల్ పర్సన్. నేను నటించిన సినిమాలను నేను పుట్టిన ఊరు పుణేలో చూస్తుంటాను.
అక్కడ తెలుగువాళ్లు ఎక్కువమంది ఉన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడి చూస్తున్నారు’’ అని చెప్పారు. ప్రత్యేక పాటలు చేయడం తేలిక కాదని చెబుతూ - ‘‘నేను చేసే పాటల్లో నా లుక్, కాస్ట్యూమ్స్ అసభ్యంగా లేకుండా క్లాస్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను. అందుకే, ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.
ప్రతి పాట చిత్రీకరణ ముందు ఆరేడు రోజులు కసరత్తులు చేస్తాను’’ అని చెప్పారు. ‘రుద్రమదేవి’లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నానని, ఇది పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అని హంసా నందిని తెలిపారు. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయి కథానాయిక పాత్రలొచ్చినప్పటికీ, కథలు బాగా లేకపోవడంవల్ల అంగీకరించలేదని ఆమె తెలిపారు.