
'లూటీ చేయడమే పవన్ సిద్ధాంతం'
వందకోట్ల కలెక్షన్ క్లబ్‌లో చేరేందుకు జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ కాటమరాయుడు సినిమా విడుదలైన మొదటి రెండు వారాలకు టిక్కె ట్ రేట్లు పెంచి పేక్షకులను రూ. 300 కోట్లు దోపిడీ చేసేందుకు పథకం పన్నారని అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం ఆరోపించింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్ ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు జి.ఎల్. నర్సింహ్మారావు, సినీహీరోల సంఘాల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచందర్‌రావు, సుధాకర్ మాట్లాడుతూ ప్రాణాల కన్నా మిన్నగా అభిమానించే ప్రేక్షకులను రూ. 10 నేల టిక్కెట్టు రూ.50, రూ.50 బాల్కనీ టిక్కెట్టు రూ.200లకు పెంచి దోపిడి చేస్తున్నారని ఆరోపించారు.
ఇందుకు ప్రభుత్వాలు మద్దతు పలకడం దారుణమన్నారు. హీరోగా ప్రజలను దోచుకునే జనసేన అధ్యక్షుడు, ప్రజాసేవ పేరుతో ప్ర జల్లోకి ఎలా వస్తాడని వారు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులను వక్రీకరించి అదే హైకోర్టు ద్వారా అక్రమంగా నేల టిక్కెట్టు పెంచేసి అక్రమంగా కోర్టు ఉత్తర్వులు పొంది దోపిడికి రాజమార్గం వేసుకున్నారన్నారు.
ప్రేక్షకులు కాటమరాయుడు సినిమాను మొదటి రెండువారాలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ టిక్కెటు కొన్నా దానిని జాగ్రత్తగా పెట్టుకుంటే సంబంధిత చిత్ర యూనిట్‌పై కేసులు వేసి టిక్కెట్టు డబ్బులు వసూలు చేస్తామన్నారు. ప్రజలను దోపిడీ చేసే సినిమాలను బహిష్కరించాలని కోరారు. ఈ అక్రమ దోపిడిపై సినీపెద్దలు, ‘మా’సంఘం, హీరోలు స్పందించకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.