
అదితీ రావ్ హైదరీ
అదితీ రావ్ హైదరీ నటిగా బాలీవుడ్‌లో మంచి మార్కులు వేయించుకున్నారు. డ్యాన్సర్‌గా ఇంకో రెండు మార్కులు ఎక్కువే కొట్టేస్తున్నారు. డ్యాన్స్‌లో ఇంత ప్రావీణ్యం రావడానికి మా స్కూల్ వాళ్లు చేసిన కంప్లైయింట్ లాంటి కాంప్లిమెంటే కారణం అంటున్నారు అదితీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘సాధారణంగా ‘మీ అమ్మాయి సరిగ్గా చదవడంలేదు’ అంటూ స్కూల్ నుంచి కంప్లైంట్స్ వింటుంటాం. కానీ నా విషయంలో వేరే లాంటి కంప్లైంట్ ఇంటికి వచ్చింది.మా స్కూల్‌లో టెన్త్ క్లాస్ తర్వాత ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటామో స్కూల్ వాళ్లకు ఇన్‌ఫార్మ్ చేయాలి.
నాకు డాక్టర్ అవ్వాలని ఉందని ఇంట్లో చెబితే మా పేరెంట్స్ స్కూల్ వాళ్లకు లెటర్ రాశారు. దానికి బదులుగా.. ‘మీ అమ్మాయి డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేయాలనుకుంటోంది. చాలా సంతోషం. కానీ కొంతమంది పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ లాంటి స్పెషల్ టాలెంట్ వరంలా లభిస్తుంది. అదితి ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందంటే.. ఒకవేళ తను డ్యాన్స్ కంటిన్యూ చేయకపోతే తనకు ఉన్న స్పెషల్ టాలెంట్‌ను వృథా చేసుకున్నట్టే. మీ అమ్మాయిని డాక్టర్ కాదు.. డ్యాన్సర్‌ని చేయండి’ అని స్కూల్ వాళ్లు రాశారు. కళ్ల చుట్టూ అక్షరాల్ని కట్టేయకుండా కాళ్లకు గజ్జెలు కట్టుకోమని స్కూల్ వాళ్లే ప్రోత్సహించారు. అలా స్కూల్ వాళ్లు ఇచ్చిన కాంప్లిమెంట్ వల్ల నేనీ రోజు మంచి డ్యాన్సర్‌ని అయ్యాను’’ అని అదితీ రావ్ పేర్కొన్నారు.