ఓవర్సీస్లోనే 300 కోట్లు..!
2014 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన పికె ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అమీర్ఖాన్, అనుష్క శర్మ, బోమన్ ఇరనీ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. ఇప్పటికే భారత్లో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన పికె తాజాగా ఓవర్సీస్లోనూ ఓ అరుదైన ఘనత సాదించింది.
మూఢనమ్మకాలపై సెటైరికల్గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో రూ. 348 కోట్ల వసూళ్లు సాదించగా, ఓవర్సీస్లో కూడా రూ. 300 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హాంకాగ్, తైవాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికీ నడుస్తున్న పికె, భవిష్యత్తులో మరిన్ని రికార్డ్లు నెలకొల్పే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
విధూ వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో అమీర్ఖాన్ గ్రహాంతరవాసిగా నటించాడు. పొరపాటున భూమి మీదకు వచ్చిన ఓ ఏలియన్ తిరిగి తన గ్రహానికి వెళ్లటానికి కావల్సిన కీ పోగొట్టుకోవటం, ఆ కీని వెతుక్కునే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే పాయింట్ను సెటైరికల్ కామెడీ జానర్లో తెరకెక్కించారు. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే కథ కావటంతో ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తూనే ఉంది.