‘పీకే’పై చర్యలకు సర్కార్ ఆదేశం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాపై నానాటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి రామ్ షిండే మాట్లాడుతూ.. సినిమాను చూసి భాంతి భద్రత లకు భంగం కలిగించే అంశాలేమైనా ఉంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఐజీ (లా అండ్ ఆర్డర్) దేవన్ భర్తీని ఆదేశించామన్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, సినిమాలో కొన్ని సన్నివేశాలు మతవిశ్వాసాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపిస్తూ పలు సంస్థలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మూడు, నాలుగు రోజుల్లో ఈ సినిమాపై పోలీసు శాఖ నుంచి తగిన నివేదిక వస్తుందని, తర్వాత దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని షిండే స్పష్టం చేశారు.