‘పీకే’ థియేటర్లపై బజరంగ్ దాడి
- హిందూ దేవతలను కించపరచారని ఆందోళన
అహ్మదాబాద్/భోపాల్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్‌లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్‌దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్‌లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఈ దాడికి తామే బాధ్యులమని, పీకేను నిలిపేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని భోపాల్ బజరంగ్‌దళ్ చీఫ్ జ్వలిత్ మెహతా హెచ్చరించారు. ఆమిర్ ఉద్దేశం సరైందైతే ఆయన మతానికి చెందిన దేవుళ్లను ఎందుకలా చిత్రీకరించరని ప్రశ్నించారు. అయితే అంతకుముందే ఇలాంటి వ్యాఖ్యల్ని ఆమిర్ కొట్టిపడేశారు. తనకు అన్ని మతాలు సమానమేనని, తన సినిమా సిబ్బందిలో 99 శాతం మంది హిందువులేనని పేర్కొన్నారు.