అవసరమైనవారికే భద్రత..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులకు, వారి కుటుంబసభ్యులకు కల్పించిన భద్రతను కుదించినట్లు హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే వెల్లడించారు. హోం శాఖ అనవసరమని భావించిన దాదాపు 230 మంది భద్రత సిబ్బందిని తొలగించింది. అందులో 24 మంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు, 28 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 28 మంది పీసీడీ ర్యాంక్ సిబ్బంది ఉన్నారు. వీరికి శాంతి, భద్రతలను కాపాడే బాధ్యతలు అప్పగించనున్నారు. కాగా, పోలీసు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు.
ఎవరికైనా పోలీసు భద్రత అవసరమైతే వారికి భద్రత ఎంతమేర అవసరం, ఇవ్వాలా...? వద్దా..? ఒకవేళ భద్రత ఇవ్వాల్సి వస్తే ఎంతమంది సిబ్బందిని నియమించాలి..? తదితర నిర్ణయాలు ఈ కమిటీ తీసుకుంటుందని వెల్లడించారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, కొందరు రాజకీయ నాయకులకు, వారి కుటుంబం సభ్యులకు ఎలాంటి ప్రాణ హానీ లేదు. అయినప్పటికీ వారు పోలీసు శాఖ నుంచి భద్రత పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
తమకు బెదిరింపు ఫోన్లు వచ్చాయని కొందరు, తమకు శత్రువులతో ముప్పు పొంచి ఉందని మరికొందరు పోలీసు శాఖ నుంచి భద్రత పొందారు. కొందరైతే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకున్నప్పటికీ సమాజంలో తమ ప్రతిష్ట పెంచుకునేందుకు పోలీసు శాఖ నుంచి భద్రత పొందుతున్నారు. ఇలాంటి వారందరిని గుర్తించి ఏకంగా 230 మంది భద్రత సిబ్బందిని తొలగించినట్లు ఆయన తెలిపారు. త్వరలో మాజీ మంత్రులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, నారాయణ్ రాణే, ఆర్.ఆర్.పాటిల్‌తోపాటు మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితర కీలక నాయకుల భద్రతలో కూడా కోత విధించనున్నట్లు ఆయన వివరించారు.