
అమితాబ్ సలహా రజినీకాంత్ పాటిస్తారా!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గడిచిన కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రజినీకాంత్ కు తమిళనాడు ప్రజల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు ఉంది.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గడిచిన కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రజినీకాంత్ కు తమిళనాడు ప్రజల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా రంగంలో సక్సెస్ హీరోగా కొనసాగుతున్న రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ అనేకసార్లు వార్తలు రాగా, వాటిని రజినీ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూవచ్చారు. కానీ, ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఏఐఏడీఎంకె లో పన్నీర్ సెల్వం, శశికళ మధ్య కొనసాగుతున్న వర్గపోరాటం ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థి పార్టీలు ఈ సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఏఐఏడీఎంకేలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న తీవ్రమైన ఉత్కంఠ, హైడ్రామా మధ్య రజనీకాంత్ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. తమిళనాట రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో రజినీకాంత్ సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తమిళనాట బలపడటానికి కేంద్రంలోని బీజేపీ రాజకీయ వ్యూహంతో ముందుకెళుతోంది. భవిష్యత్తు పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని, ఏఐఏడీఎంకేలో రెండువర్గాలుగా చీలికలు ఏర్పడిన పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడానికి పావులు కదుపుతోందన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే బలమైన శక్తిగా ఎదగగలరని, ఆ మేరకు ఆయనపై తీవ్రమైన ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని చెబుతున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు చేసే విషయంలో రజినీకాంత్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయనను ఎలాగైనా రాజకీయాల్లోకి రప్పించాలని కొందరు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న విషయం తెలిసి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన సహచర నటుడు రజినీకాంత్ కు హితబోధ చేసినట్టు సమాచారం.
1980 ల్లో కాంగ్రెస్ టికెట్ పై అలహాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత పరిణామాల్లో రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. హిందీ చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అమితాబ్ అంటే ప్రజల్లో ఇప్పటికీ క్రేజ్ ఉంది. రజినీకాంత్ తో కలిసి హమ్, గిరఫ్తార్, అంధాకానూన్ వంటి సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నడుమ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని సమాచారం తెలిసి ఆయనతో అమితాబ్ మాట్లాడినట్టు చెబుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావొద్దని అమితాబ్ తన సహచర నటుడు రజినీకాంత్ కు సలహా ఇచ్చారని అంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని అమితాబ్ ఇచ్చిన సలహాను రజినీకాంత్ పాటిస్తారా? లేక రాజకీయ రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం మరికొద్ది రోజులు వేచిచూడాలని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.