సోషల్ మీడియాలో ఉండాలంటే: మెగాస్టార్
ముంబై: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ ప్రముఖుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సామాజిక అంశాలతో సహా తాజా విశేషాలపై స్పందిస్తుంటారు. నెటిజెన్లకు, కొత్తగా సోషల్ మీడియాలోకి రావాలనుకునే వారికి అమితాబ్ ఓ సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉండాలంటే ప్రశంసలను స్వీకరించడంతో పాటు విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమిత్ పేర్కొన్నారు. ప్రశంసలతో పాటు విమర్శలను కూడా తాను ఆస్వాదిస్తానని చెప్పారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా అమితాబ్ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు.
తాజాగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్ ఉదంతంపై అమితాబ్ స్పందించారు. గుర్‌మెహర్ విషయం వ్యక్తిగతమైనదని అభిప్రాయపడ్డారు. దీని గురించి మాట్లాడితే బహిరంగమవుతుందని చెప్పారు. కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ కుమార్తె, లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని గుర్‌మెహర్ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకుల దాడిని ఖండిస్తూ, సోషల్ మీడియాలో వారిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గుర్‌మెహర్ తన తండ్రి మరణం గురించి చేసిన ట్వీట్ దుమారం రేపింది. కొందరు సెలెబ్రిటీలు విమర్శించగా, మరికొందరు సమర్థించారు. చివరకు ఆమె సోషల్ మీడియా వార్‌కు స్వస్తి పలికింది.