
లోకల్ ట్రైన్‌లో అమితాబ్ సందడి!
అమితాబ్ బచ్చన్ హఠాత్తుగా లోకల్ ట్రైన్‌లో ప్రత్యక్షమైతే ప్రయాణీకులు స్వీట్ షాక్‌కు గురవుతారు. వాళ్లతో మాటలు కలిపి, పాటలు కూడా పాడితే జీవితాంతం గుర్తుంచుకోదగ్గ తియ్యని అనుభూతి మిగిలిపోతుంది. ఆదివారం ఉదయం కొంతమంది ప్రయాణీకులకు అలాంటి అనుభూతే మిగిలింది. ముంబయ్ లోకల్ ట్రైన్ ఎక్కి వీటీ నుంచి భండుప్ స్టేషన్ వరకూ అమితాబ్ ప్రయాణం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఆదర్శవంతంగా నిలిచే కామన్ మ్యాన్ జీవితానుభవాలను ఆవిష్కరించే ‘ఆజ్ కీ రాత్ హై జిందగీ’ అనే బుల్లితెర షో చేస్తున్నారు అమితాబ్. షోలో మాత్రమే కాకుండా విడిగా ఎవరైనా రియల్ లైఫ్ హీరోని కలవాలనుకున్నారు.
ఇందులో భాగంగా సౌరబ్ నింబ్కర్ అనే కుర్రాణ్ణి కలిశారు. లోకల్ ట్రైన్‌లో దాదర్ నుంచి అంబర్‌నాథ్ వరకూ ప్రయాణం చేస్తూ, సౌరబ్ పాటలు పాడతాడు. ఆ పాటలను మెచ్చి, ప్రయాణీకులు ఇచ్చే డబ్బుని ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు ఇచ్చేస్తాడు. ఫార్మాక్యూటికల్ కంపెనీలో పని చేస్తున్న సౌరబ్ ఈ పని చేయడానికి కారణం అతని తల్లి కేన్సర్ వ్యాధితో చనిపోవడమే. అప్పట్నుంచీ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇది తెలిసి, సౌరబ్‌ని ఎంకరేజ్ చేయడం కోసమే అమితాబ్ లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేశారు. సౌరబ్‌తో కలిసి ఆయన పాటలు పాడారు. బిగ్ బి ఇచ్చిన ఈ ప్రోత్సాహానికి సౌరబ్ ఆనందపడిపోయాడు.