సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలో కిక్కిరిసిన రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ జరిగిన ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులే కావడం గమనార్హం. చెన్నై తాంబరం–బీచ్ రైలు మార్గంలో మంగళవారం ఉదయం 7.30 గంటలకు విద్యుత్ తీగ తెగిపోగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్లాట్‌ఫారాలపై వందలకొద్దీ ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. తిరిగి 8.30 గంటల తరువాత రైళ్ల రాకపోకలు ప్రారంభం కావటంతో తిరుమాల్పూరు ఎక్స్‌ప్రెస్ రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో బీచ్‌స్టేషన్ నుంచి 8.55 గంటలకు బయలుదేరింది.
అయితే, అది లోకల్ రైలుగా పొరపాటుపడిన విద్యార్థులు, యువకులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కారు. పరంగిమలై రైల్వేస్టేషన్ సమీపంలోని రెండు రైల్వేలైన్ల మధ్యన ఉన్న ఎత్తైన డివైడర్ గోడ వీరికి తగలడంతో 20 మందికిపైగా కిందపడిపోయారు. వీరిలో భరత్ (17), శివకుమార్ (20), నవీన్‌కుమార్ (21) అనే విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంకర్ (23), భారతి (22) అనే వారు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు.సుమారు 15 మంది తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
రైలులో ప్రయాణిస్తూ సోమవారం రాత్రి ఇదే డివైడర్ గోడను ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. మంగళవారం ఉదయం ఘటనలోని మృతుల కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సీఎం పళనిస్వామి సాయం ప్రకటించారు. ఎక్స్‌ప్రెస్ రైళ్ల లైన్‌లోకి సబర్బన్ రైలును మళ్లించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. సబర్బన్ రైళ్ల లైన్‌లో విద్యుత్ నిలిచిపోయినందునే ఇలా చేశామని తెలిపారు. ఫుట్ బోర్డ్ ప్రయాణం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ప్రజలను కోరారు. ఫుట్‌బోర్డ్ ప్రయాణమే ఈ విషాదానికి కారణమని, ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment