![Andhra Pradesh Woman Captured The Attention Of The AR Rahman With Her Soulful Rendition - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/16/6jc7lhqo_woman-singing%2C-andhra%2C-ar-rahman_625x300_15_November_18.jpg.webp?itok=2PZmINpa)
సాధరణంగా కనిపించే వ్యక్తుల్లో అసాధరణ ప్రతిభ దాగి ఉంటుంది. గతంలో అయితే ఇలాంటి వారికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన ప్రోత్సాహం, వేదిక దొరకడం గగనమయ్యేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని నేటి కాలంలో ఇలాంటి సమస్యలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. టాలెంట్ ఎక్కడ కనిపించినా దాన్ని తమ సెల్‌ఫోన్‌లలో బంధించి సోషల్ మీడియా సాక్షిగా వైరల్ చేస్తూ ఒక్క రాత్రిలోనే వారికి కావాల్సిన పేరును, కీర్తిని తెచ్చిపెడుతున్నారు నెటిజన్లు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1994లో తమిళంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘కాదలన్’ చిత్రం తెలుగులో ప్రేమికుడు పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా’ పాట అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ పాటలో ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఈ పాటను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బేబి అనే మహిళ అంతే మధురంగా పాడి ఒక్క రాత్రిలోనే ఫేమస్ అయ్యారు. బేబి ‘ఓ చెలియా’ పాట పాడుతుండగా తీసిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా వైరల్ అవుతోన్న ఈ వీడియో చివరకూ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దృష్టికి చేరింది. బేబి స్వర మాధుర్యం రెహమాన్ మనసును గెలుచుకుంది.
బేబి వాయిస్‌కు ఫిదా అయిన రెహమాన్.. ఆమె పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ‘అద్భుతమైన.. అందమైన గొంతు’ అంటూ క్యాప్షన్ చేశారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను దాదాపు 18 లక్షల మంది వీక్షించారు. రెహమాన్‌ను మెప్పించిన బేబి ఇంటికి పలువురు ప్రముఖుల క్యూ కట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment