
సునీత - అనిల్ కపూర్‌ల జోడి(ఫైల్ ఫోటో)
నన్ను వదిలేయమని చాలా మంది తన మీద ఒత్తిడి తెచ్చారు
‘నేను తనను ఒక ప్రాంక్ కాల్ ద్వారా కలిశాను.. రేపు పెళ్లి చేసుకుందాం అని చెప్పాను.. మరుసటి రోజే వివాహం చేసుకున్నాం.. పాపం హనీమూన్‌కి తనోక్కతే వెళ్లింది.. నా గురించి నా కన్నా ఎక్కువ తనకే తెలుసు, తనే నా బలం’ అంటూ భార్య సునీతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు ‘మిస్టర్ ఇండియా’ అనిల్ కపూర్. వివాహం కంటే ముందే ఒక దశాబ్ద కాలంగా అనిల్ కపూర్‌కు సునీతతో పరిచయం. అంటే వీరి ప్రేమకు, స్నేహానికి 45 ఏళ్లు నిండయాన్నమాట. ఇంత అద్భుతమైన సుదీర్ఘ ప్రయాణం గురించి, తన భార్య సునీత గొప్పతనం గురించి సోషల్ మీడియా సాక్షిగా ప్రశంసలు కురిపించారు అనిల్ కపూర్.
‘సినిమాల్లోకి రాకముందే సునీతతో పరిచయం ఏర్పడింది. అది కూడా చాలా విచిత్రంగా. ఇప్పడు ప్రాంక్ కాల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ 45 ఏళ్ల మునుపే మా పరిచయానికి కారణం ప్రాంక్ కాల్. ఆ రోజు సునీతకు ప్రాంక్ కాల్ చేసిన నేను ముందు తన గొంతుతో ప్రేమలో పడిపోయాను. అప్పటికింకా నేను సినిమాల్లోకి రాలేదు. ఇంకా జీవితంలో స్థిరపడలేదు. అయినా తను నన్ను ప్రేమిస్తూనే ఉంది. నన్ను వదిలేయాలని చాలా మంది, చాలా సార్లు ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. కానీ తను అలా చేయలేదు.
నా జీవితంలో తొలి విజయం ‘మేరి జంగ్’. ఈ చిత్రం విజయం సాధించడంతో పర్వాలేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. వెంటనే సునీతతో మనం రేపు వివాహం చేసుకుందాం అని చెప్పాను. మరుసటి రోజే మేము వివాహం చేసుకున్నాం. అలా విజయం, అదృష్టం(సునీత) రెండు ఒకే ఏడాదిలో నా జీవితంలోకి వచ్చాయి. కానీ వివాహం అయిన మూడు రోజుల్లోనే నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. పాపం తను ఒక్కతే హనిమూన్‌కి విదేశాలకు వెళ్లింది’ అంటూ తమ బంధం గురించి తెలిపారు. బాలీవుడ్‌లో పర్ఫేక్ట్ జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు సునీత - అనిల్ కపూర్.
ఈ విషయం గురించి అనిల్ కపూర్ ‘45 ఏళ్లుగా మా మధ్య ప్రేమ, స్నేహ, గౌరవం కొనసాగుతునే ఉన్నాయి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె లాంటి వ్యక్తిని మరోకరిని చూడలేదు. ఇంత చక్కని భార్య దొరికినందు వల్లే నా రోజు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. తను మంచి తల్లి, భార్య అన్నింటికి మించి మంచి మనిషి. నా గురించి నా కంటే బాగా తనకే తెలుసు. తనే నా బలం’ అంటూ పోస్టు చేశారు.
దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ ప్రేమ ఎందరికో ఆదర్శం కావాలి. మరిన్ని సంతోషాలు మీ సొంతం కావాలంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.వీరికి ముగ్గురు సంతానం. సునీత - అనిల్ కపూర్‌లకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్. వీరంతా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు.
ప్రస్తుతం అనిల్ కపూర్ ‘ఫనే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కూతురు సోనమ్‌తో కలిసి తొలిసారి ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.