తన కంటే దాదాపు 26 ఏళ్లు పెద్దవాడైన నటుడు మిలింద్ సోమన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అంకితా కొన్వార్. గతేడాది ఏప్రిల్‌లో తన చిరకాల ప్రేమికుడితో ఏడడుగులు వేసిన అంకిత తీరుపై పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. యువకులు ఎవరూ దొరకలేదా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. అయితే ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, తన పట్ల మిలింద్‌కు ఉన్న ప్రేమ కారణంగానే వివాహ బంధంలో అడుగుపెట్టానని అంకితా పేర్కొంది. మిలింద్‌తో ప్రేమ, పెళ్లి, ఈ క్రమంలో ఎదురైన అవాంతరాల గురించి హ్యూమన్స్ బాంబే ఫేస్‌బుక్ పేజ్‌లో ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తను చనిపోయాక మలేషియా వెళ్లాను..
‘ నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి మరణించిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. మలేషియాలోని ఎయిర్ ఏషియా కాబిన్ క్రూ మెంబర్‌గా పని చేయడం ప్రారంభించాను. తను చనిపోయిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ఇక గాయం ఎప్పటికీ మానదేమో అనుకున్నాను. అయితే కొన్ని నెలల తర్వాత చెన్నైకి వచ్చిన నాకు మిలింద్‌తో పరిచయం ఏర్పడింది. చెన్నైలో కొలీగ్స్‌తో కలిసి హోటల్‌లో ఉండేదాన్ని. ఓ రోజు లాబీలో తనను చూశాను. తనకి నేను పెద్ద అభిమానిని. అందుకే వెళ్లి పలకరించాను. కానీ తను బిజీగా ఉన్నాడు. తనతో కలిసి డ్యాన్స్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. కొన్ని రోజులకు తను నన్ను మరచిపోయాడనిపించింది. అయితే అది తప్పని నిరూపించాడు. నా ఫోన్ నెంబర్ మరచిపోయానని చెప్పడంతో ఫ్రెండ్ నంబర్ తీసుకుని మెసేజ్ చేయమని చెప్పాడు. అలా పరిచయం పెరిగింది. తనకు నా గతం గురించి చెప్పాను.
‘నీతో ప్రేమలో పడినపుడే నీకు సంబంధించిన అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి భయపడాల్సిన పనిలేదు అని చెప్పాడు. ఆ క్షణం నుంచి తనని నా వాడిగా భావించడం మొదలుపెట్టాను. ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత తనని పెళ్లి చేసుకున్నాను. అయితే మా ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం కారణంగా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మా పెళ్లిని వ్యతిరేకించారు. కానీ తన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్లే దగ్గరుండి పెళ్లి చేశారు. మీరు నమ్ముతారో లేదో. మేము మూడుసార్లు పెళ్లి చేసుకున్నాం. నా జీవితంలో జరిగిన అత్యంత మంచి విషయం తనతో పెళ్లి జరగడమే. తనతో జీవితకాలపు ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ అంకితా రాసుకొచ్చింది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు..‘నిజమైన ప్రేమ పొందిన నువ్వు అదృష్టవంతురాలివి. మీ ప్రేమ చిరకాలం ఇలాగే ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment