
దక్షిణాఫ్రికాలో `అంతకుముందు ఆ తరువాత` ప్రదర్శన
ఇటీవల విజయం సాధించిన ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఈ చిత్రాన్ని దక్షిణాఫ్రికాలోని అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించడానికి ఎంపిక చేశారు.
చెన్నై: ఇటీవల విజయం సాధించిన ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఈ చిత్రాన్ని దక్షిణాఫ్రికాలో జరగబోయే రెండో భారత అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించడానికి ఎంపిక చేశారు. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ నిర్మాతగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు ప్రేమకథా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. దక్షిణాఫ్రికాలో 2014 జనవరి 16 నుంచి 23 వరకు జరగనున్న ఐఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎ (ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా) భారత అంతర్జాతీయ చిత్రోత్సవాల సందర్భంగా సౌత్ ఆఫ్రికాలోని ప్రటోరియా, జోహాన్స్‌బర్గ్, డర్బన్, కేప్‌టౌన్ పలు పట్టణాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ చిత్రోత్సవాలలో తమ చిత్రం ఎంపిక కావడం ఎంతో సంతోషం కలిగించిందని దర్శకుడు మోహనకృష్ణ మీడియాకు తెలిపారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినా సుమంత్ అశ్విన్, ఈషాల జంట ప్రేక్షుకులను ఎంతో ఆకట్టుకుంది. ఒక యువతి, యువకుడు ప్రేమకు ముందు ఎలా ఉన్నారు? పెళ్లయ్యాక అదే ప్రేమతో ఉన్నారా? అన్న అంశాన్ని తీసుకుని యువతకు నచ్చే విధంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, ఈషాలు హీరోహీరోయిన్లుగా నటించగా, రోహిణి, రామ్ రామేశ్, రవి బాబు, మధుబాల ప్రధాన పాత్రలలో నటించి అందరినీ మెప్పించారు. ఈ చిత్రం దర్శకుడు మోహనకృష్ణ తీసినా విధానం విమర్శకులను సైతం మెప్పించింది. చిన్న సినిమా అయినా ప్రేక్షుకులకు కొత్తగా అనిపించడంతో విజయం బాట పట్టింది. ప్రస్తుత రోజుల్లో ఈ చిత్రం సౌతాఫ్రికాలో పోటీలో పాల్గొనడం తెలుగు చిత్ర పరిశ్రమకే సంతోషమని నిర్మాత కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరానికి గాను ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ఎంపిక చేసిన పది చిత్రాల్లో ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రం ఉండడం విశేషం.