జీవితంలో యాక్టర్‌వి కాలేవన్నారు : ప్రియదర్శి | Priyadarshi Pulikonda Talk About Sarangapani Jathakam Movie | Sakshi
Sakshi News home page

జీవితంలో యాక్టర్‌వి కాలేవన్నారు : ప్రియదర్శి

Published Tue, Apr 22 2025 2:08 PM | Last Updated on Tue, Apr 22 2025 2:52 PM

Priyadarshi Pulikonda Talk About Sarangapani Jathakam Movie

నేను జాతకాలను ఎక్కువగా నమ్మను కానీ అందరిలాగే మా అమ్మనాన్నలు కూడా వీటిని నమ్ముతారు. ఇండస్ట్రీలోకి రాకముందు నా జాతకం చూపిస్తే జీవితంలో నేను యాక్టర్‌ని అవ్వనని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. నా మీద నమ్మకంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. జాతకాలను కాకుండా చేసే పని మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పటికీ అదే ఫాలో అవుతాను’ అన్నారు హీరో ప్రియదర్శి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’.  మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక  కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 25న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘సారంగపాణి జాతకం’ సినిమా గతేడాది చివర్లో రావాల్సింది. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం. కోర్ట్ లాంటి హిట్ తరువాత మళ్లీ వెంటనే ‘సారంగపాణి జాతకం’ అని వస్తుండటం ఆనందంగా ఉంది.

‘సారంగపాణి జాతకం’ చిత్రంలో చూపించినట్టుగా కాదు కానీ.. నేను కొంత  వరకు జాతకాలు నమ్ముతాను. ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు. మంచి సినిమాను చేయాలని ప్రయత్నిస్తాం. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ బిజినెస్ పరంగా, థియేటర్ల పరంగా అన్నీ లెక్కేసుకుని ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం.ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమాలో చూపించాం.

కామన్ మేన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. ‘మల్లేశం‘ అయినా,  ‘సారంగపాణి‘  అయినా మన చుట్టు పక్కనే చూస్తాం. వారి జర్నీ చాలా పెయిన్ ఫుల్‌గా ఉంటుంది. ‘మల్లేశం, బలగం, కోర్ట్, సారంగపాణి‘ ఇలా అన్నీ కూడా మన చుట్టూనే చూస్తుంటాం. ఇందులో జాతకాల్ని నమ్మే ఓ కుర్రాడి పాత్రను పోషించాను.

ప్రస్తుతం నవ్వించడం అనేది చాలా కష్టమైన పని. ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఓ పాత్రను ఇంత వరకు నేను చేయలేదనిపిస్తోంది. ఇది చాలా కొత్తగా ఉండబోతోంది. ఈ చిత్రం, అందులోని నా పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.

ఇంత వరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికంలోనే ఎక్కువగా మాట్లాడాను. కానీ ఈ సారి మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడతాను. ఇంద్రగంటి గారి స్టైల్‌లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నా కోసం ఇందులో సపరేట్ ట్రాక్, టైమింగ్‌ను సెట్ చేశారు. అది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.

ఇంద్రగంటి గారితో ఒక ఫోటో దిగితే చాలని అనుకునేవాడ్ని. కానీ అలాంటి ఆయనే కథను తీసుకొచ్చి చెప్పారు. కథ విన్నవెంటనే అద్భుతంగా అనిపించింది. జాతకాల పిచ్చోడు అంటూ కథ మొత్తాన్ని చెప్పారు. ‘సారంగపాణి జాతకం‘ అని టైటిల్ కూడా చెప్పారు. ఆ టైటిల్ కూడా నాకు చాలా నచ్చింది.  టైటిల్ అద్భుతంగా ఉంది సర్ అని అన్నాను. ఇక ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతీ ఒక్కరికీ ఇంద్రగంటి గారితో పని చేసే అదృష్టం రావాలని కోరుకుంటున్నాను.

ఏషియన్ సినిమాస్‌లో ‘ ప్రేమంటే‘ అనే సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాను. గీతా ఆర్ట్స్‌లో బన్నీ వాస్ గారి నిర్మాణంలో ‘మిత్రమండలి‘ అనే మరో ప్రాజెక్టుని చేస్తున్నాను. ఇంకా కొన్ని కథలు వింటున్నాను. బలమైన పాత్రలుండే సినిమాల్ని ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement