
బంపర్ ఆఫర్
పవన్ కల్యాణ్ సరసన మరో మలయాళ కుట్టి
ఈ టైమ్ ఉందే.. అది ఎవరి వైపు ఉంటే వాళ్లకు జాక్‌పాట్ తగిలినట్టే. ఊహించని బంపర్ ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయ్. అందుకు తాజా ఉదాహరణ అనూ ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మాయి కథానాయిక అయి జస్ట్ ఏడాది అయ్యింది. మలయాళంలో ‘యాక్షన్ హీరో బిజ్జు’, తెలుగులో ‘మజ్ను’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’లో నటిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఇప్పటికే కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. మరో నాయికగా అనూని తీసుకున్నారు.
కీర్తి కథానాయిక అయి రెండు మూడేళ్లవుతోంది. ఏమైనా తక్కువ సమయంలో ఈ మలయాళ కుట్టీలిద్దరూ బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ సరసన అంటే కెరీర్‌పరంగా ఓ మెట్టు పైకి ఎక్కినట్లే. ఇక.. త్రివిక్రమ్ సినిమాల్లో కథానాయిక పాత్ర ఎలాగూ బాగుంటుంది కాబట్టి.. నటనపరంగా ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్స్ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రానికి ‘వై దిస్ కొలవెరి..’ ఫేమ్ అనిరుధ్ రవిచందర్ పాటలు స్వరపరుస్తున్నారు.