ఎందుకీ ఆలోచన... ఎక్కడికీ అడుగులు?
సినిమా పేరేంటి? చెప్పలేదు. పవన్‌కల్యాణ్ ఫుల్ లుక్కేది? ఇంకా విడుదల చేయలేదు. అసలు కథేంటి? చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. కానీ, మా సినిమా కాన్సెప్ట్ ఈ పోస్టర్‌లో దాగుందంటూ కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేశారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రెండు ఫొటోలున్నాయి.
ఒకటి.. అంతులేని ఆలోచనల ఎడారిలో మునిగిన పవన్ ముఖం! రెండోది.. బహుదూరపు బాటసారిలా అడుగులు వేస్తున్న అతణ్ణి వెనక నుంచి తీసిన ఫొటో! ఈ స్టిల్ చూడగానే ప్రేక్షకుల్లో ‘ఎందుకీ ఆలోచన... ఎక్కడికీ అడుగులు?’ అని కొత్త ప్రశ్నలు రేకెత్తాయి. కథ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగింది. దర్శక, నిర్మాతలు శుక్రవారం ఈ స్టిల్‌తో సర్‌ప్రైజ్ చేస్తే, ఈ సినిమాతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న అనిరు«ద్ రవిచంద్రన్ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు సోషల్ మీడియా ద్వారా మ్యూజికల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సమర్పణ: శ్రీమతి మమత.