రాధాకృష్ణ, త్రివిక్రమ్, కీర్తి సురేశ్, పవన్ కల్యాణ్, ఖుష్బూ, అను ఇమ్మాన్యుయేల్, అనిరుద్
‘‘నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే అందర్నీ గుండెల్లో పెట్టుకోవాలనుంటుంది. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని అనుకోలేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అనిరు«ద్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఎన్ని సినిమాలు చేస్తావంటే 10 లేక 12 అనుకున్నా. ‘ఖుషి’ తర్వాత వెళ్లిపోదామనుకున్నా. మీ (అభిమానులు) ప్రేమ నన్ను పాతిక సినిమాల వరకూ తీసుకొచ్చింది. జీవితంలో ఓటమికి భయపడలేదు.. గెలుపుకి పొంగిపోలేదు. ‘జానీ’ ఫెయిలయ్యాక నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు నాకు అండగా నిలవకున్నా నన్నింకా సినిమాల్లో ఉండనిచ్చింది మీరే . భారతీయ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ జెండా, దేశం కోసం నేను రాజకీయాల్లోకి వెళ్లానే కానీ వేరే ఏదీ కాదు.
నేను నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు స్నేహితులు, హితులు నాకు చేయూతగా నిలబడలేదు. ‘గోకులంలో సీత’ చిత్రంలో ఓ రచయితగా పని చేసిన త్రివిక్రమ్, మీరు నాకు తోడుగా ఉన్నారు. దర్శకుడిగా ‘జల్సా’ సినిమాతో నాకు హిట్ ఇచ్చారు. అందరూ అంటుంటారు. త్రివిక్రమ్ మీకు బ్యాక్ సపోర్ట్ అట కదా? అని. నేను, త్రివిక్రమ్ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే. నా రక్తం పంచుకుని పుట్టినవారిపై నేనెప్పుడూ కోప్పడలేదు. కానీ, త్రివిక్రమ్‌ని కోప్పడగలను.
అంత చనువు ఉంది. ‘జల్సా’ టైమ్‌లో నేను దుఃఖంలోనే ఉన్నా. ‘నా దేశం నా ప్రజలు’ పుస్తకం తెచ్చి ఇచ్చారు త్రివిక్రమ్. అది నాలో స్ఫూర్తి నింపింది. నా మీద తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు నిర్మాతలు. కానీ, రాధాకృష్ణగారు సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. మైఖేల్ జాక్సన్ తర్వాత నాకిష్టమైన సంగీత దర్శకుడు అనిరు«ద్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను రూపాయి సరిపోతుందంటే రూపాయిన్నర ఖర్చు పెడదామంటారు రాధాకృష్ణగారు. పీడీ ప్రసాద్‌గారు, నాగవంశీ ఈ సినిమాకి రథ చక్రాల్లా పనిచేశారు.
పవన్‌గారు ఇటలీలో ఉన్నప్పుడు ఈ కథని ఫోనులో రెండు నిమిషాలు చెప్పా. ‘చాలా బాగుంది.. చేస్తున్నాం’ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ కథ అడగలేదు. నేను చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. కల్యాణ్‌గారి నట విశ్వరూపం చూస్తారు. ఆయనతో పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రావాలి. మీరందరూ కోరుకుంటున్న ఆ స్థాయికి ఆయన ఎదగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, నిర్మాతలు ఏయం రత్నం, భగవాన్, పుల్లారావు, ‘దిల్’ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment