సెండాఫ్.. టేకాఫ్!
ఓ సినిమాకు సెండాఫ్ చెబుతూ... మరో సినిమాకు వెల్కమ్ చెప్పనున్నారు పవన్‌కల్యాణ్. కిశోర్ పార్ధసాని (డాలి) దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రీకరణ చివరి దశకు వచ్చేసిందట. వచ్చే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఓ వారం ముందే.. మార్చి 24న రిలీజ్ చేసే ఛాన్సుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించనున్న విషయం తెలిసిందే.
గతేడాది డిసెంబర్లోనే త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నా... వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు, మార్చి 14న ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణకు ముహూర్తంగా నిర్ణయించారట. ఈసారి వాయిదా పడే ఛాన్స్ లేదని చిత్ర బృందం చెబుతోంది. ఆల్రెడీ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ రెండు మూడు ట్యూన్స్ రెడీ చేసిచ్చారట. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. బహుశా.. ఓ చేత్తో ఓ సినిమా యూనిట్‌కి వీడ్కోలు చెబుతూ, ఇంకో చేత్తో రెండో సినిమా యూనిట్‌కి వెల్కమ్ చెప్పడం పవన్ కెరీర్లో ఇదే మొదటిసారి అవుతుందేమో!