
కత్తిలాంటోడు సరసన బొమ్మాళి
మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ కత్తిలాంటోడు హీరోయిన్ కోసం జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.
చెన్నై: మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ కత్తిలాంటోడు హీరోయిన్ కోసం జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. సినిమా ఇంకా ప్రారంభంకాకుండానే భారీ పబ్లిసిటీకి నోచుకున్న ఈ కత్తిలాంటోడు జోడీ కోసం కూడా అంతే బ్రహ్మాండంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్, స్టాలిన్ భామ అనుష్కశెట్టి దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన విశేషాలను చిత్ర యూనిట్ సిబ్బంది ఒకరు మీడియాకు చెప్పారు. ఇంకా అధికారికంగా సైన్ చెయ్యనప్పటికీ, టాలీవుడ్ అరుంధతిని ఎంపిక చేసినట్టు తెలిపారు. చిరంజీవి150 సినిమాకు జోడీగా హీరోయిన్ అనుష్కను సంప్రదించామని, దీనికి ఆమె నోటిమాట ద్వారా ఓకే చెప్పినట్టు చెప్పారు. ఇప్పటికే రెండు తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న బొమ్మాళి , డేట్స్ ఎడ్జస్ట్ మెంటు కోసం ప్రయతిస్తున్నట్టు వార్తాసంస్థకు చెప్పారు.
కాగా అనుష్క 2006లో చిరంజీవి "స్టాలిన్" లో మెరుపులు మెరిపించింది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నఈ కత్తిలాంటోడు సినిమాకు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా అవతరించడం మరో విశేషం. వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పని ఇప్పటికే మొదలుగాకా, రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుంది. తమిళంలో సూపర్ హిట్ మూవీ 'కత్తి' ని మెగాస్టార్ 150 సినిమాగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.