Kathilantodu
-
ఊ.. కొడతారా?
మెగాస్టార్ చిరంజీవి అండ్ కో ప్రతిపాదనకు ప్రముఖ నటుడు జగపతిబాబు ఊ.. కొడతారా? ఊహూ.. అంటారా? జగ్గూ భాయ్ మనసులో ఏముంది? ఫిల్మ్‌నగర్ ప్రముఖుల్లో హాట్ టాపిక్ ఇది. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకునిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 150వ చిత్రంలో ప్రతినాయకునిగా నటించమని జగపతి బాబుని అడిగారట. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కథానాయకునిగా నటించిన తమిళ చిత్రం ‘కత్తి’కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ ‘కత్తి’లో ప్రతినాయకునిగా నటించారు. సూటూ.. బూటూ.. మల్టీ నేషనల్ కంపెనీ అధినేత పాత్రలో నీల్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. టిపికల్ విలన్ క్యారెక్టర్ అది. డ్రస్సింగ్ స్టైల్, మేకోవర్ అంతా ఇటాలియన్ లుక్‌లో ఉంటుంది. తెలుగులో ఈ పాత్ర జగపతి బాబు చేస్తే బాగుంటుందని చిరు 150వ చిత్రబృందం భావించారట. ఎందుకంటే.. ‘లెజెండ్’లో బాలకృష్ణతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో ప్రతినాయకునిగా జగ్గూ భాయ్ రౌద్రరసం పలికించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు లభించాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్‌గానూ కనిపించారు. దీంతో వీవీ వినాయక్ ఆయన్ను సంప్రతించారట. అయితే.. జగపతి బాబు మాత్రం ఇంకా ఏ మాటా చెప్పలేదని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే రజనీకాంత్, బాలకృష్ణ, చిన్న ఎన్టీఆర్‌ల చిత్రాల్లో ప్రతినాయకునిగా నటించిన జగపతిబాబు, చిరంజీవి చిత్రంలోనూ ప్రతినాయకునిగా నటిస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ. -
మావయ్యకు గెస్ట్‌గా..!
మెగాస్టార్ చిరంజీవి ‘కత్తిలాంటోడు’ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఇక సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ఇందులో అనుష్క కథానాయిక అనీ, క్యాథరిన్ ఐటమ్ సాంగ్ చేయనుందనీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటి సంగతెలా ఉన్నా ఈ చిత్రంలో చాన్స్ వస్తే, నటిస్తానని అల్లు అర్జున్ అంటున్నారు. ‘‘మావయ్య సినిమాలో అవకాశం రావాలే గానీ అతిథి పాత్ర అయినా చేయడానికి రెడీ’’ అని బన్నీ పేర్కొన్నారు. అప్పట్లో ‘శంకర్‌దాదా జిందాబాద్’లో ఓ పాటలో మావయ్యతో కలిసి చిందేశారు బన్నీ. ఆ తర్వాత ఆయనతో కలిసి నటించలేదు. ఒకవేళ చిరు తాజా చిత్రంలో గెస్ట్ రోల్ ఉండి, అది బన్నీకి దక్కితే అప్పుడీ స్టైలిష్ స్టార్ దిల్ ఖుష్ అయిపోతుంది. -
కత్తిలాంటోడు సరసన బొమ్మాళి
చెన్నై: మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ కత్తిలాంటోడు హీరోయిన్ కోసం జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. సినిమా ఇంకా ప్రారంభంకాకుండానే భారీ పబ్లిసిటీకి నోచుకున్న ఈ కత్తిలాంటోడు జోడీ కోసం కూడా అంతే బ్రహ్మాండంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్, స్టాలిన్ భామ అనుష్కశెట్టి దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విశేషాలను చిత్ర యూనిట్ సిబ్బంది ఒకరు మీడియాకు చెప్పారు. ఇంకా అధికారికంగా సైన్ చెయ్యనప్పటికీ, టాలీవుడ్ అరుంధతిని ఎంపిక చేసినట్టు తెలిపారు. చిరంజీవి150 సినిమాకు జోడీగా హీరోయిన్ అనుష్కను సంప్రదించామని, దీనికి ఆమె నోటిమాట ద్వారా ఓకే చెప్పినట్టు చెప్పారు. ఇప్పటికే రెండు తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న బొమ్మాళి , డేట్స్ ఎడ్జస్ట్ మెంటు కోసం ప్రయతిస్తున్నట్టు వార్తాసంస్థకు చెప్పారు. కాగా అనుష్క 2006లో చిరంజీవి "స్టాలిన్" లో మెరుపులు మెరిపించింది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నఈ కత్తిలాంటోడు సినిమాకు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా అవతరించడం మరో విశేషం. వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పని ఇప్పటికే మొదలుగాకా, రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుంది. తమిళంలో సూపర్ హిట్ మూవీ 'కత్తి' ని మెగాస్టార్ 150 సినిమాగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.