
నిర్మాతగా నాగిరెడ్డి చిరస్మరణీయుడు : వీబీ రాజేంద్రప్రసాద్
‘‘వాహినీ స్టూడియోలోని 22 ఫోర్లూ ఎప్పుడూ కళకళలాడుతుండేవి. ప్రతి సెట్‌కీ వెళ్లి... ఈ సెట్ ఎందుకు? ఇంత ఖర్చు దేనికి? అని అడుగుతుండేవారు నాగిరెడ్డి. నిర్మాత శ్రేయస్సు కోరి, వారి బాగోగులు చూసుకున్న మనసున్న వ్యక్తి ఆయన. ఆ చిరస్మరణీయుని పురస్కారం బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కి దక్కడం అతని అదృష్టం’’ అని వీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా ప్రముఖ నిర్మాతలకు అందజేసే బి.నాగిరెడ్డి స్మారక పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. 2013వ సంవత్సరానికి గాను ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక వీబీ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు.
వీబీ రాజేంద్రప్రసాద్ ఇంకా చెబుతూ-‘‘అక్కినేనిగారితో ‘ఆత్మబలం’ తీస్తున్న రోజులవి. అప్పుడాయన షూటింగులన్నీ సారథీ స్టూడియోలోనే జరిగేవి. కానీ... బి.సరోజాదేవిగారిది చెన్నయ్ వదిలి రాలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో నాగేశ్వరరావుగారి అనుమతి తీసుకొని వాహినీ స్టూడియోలోనే సెట్లు వేశాం. మొత్తం ఏడు ఫ్లోర్లూ మాకే కేటాయించి షూటింగ్ సకాలంలో పూర్తి చేయడానికి నాగిరెడ్డి మాకు అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేను’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు. ఎస్.జానకి మాట్లాడుతూ- ‘‘విజయా సంస్థ అనగానే... అద్భుతమైన చిత్ర రాజాలు కళ్లముందు కదులుతాయి. ఆ సినిమాల్లోని పాటలు ఎంత బావుంటాయో! ఇప్పుడు అలాంటి పాటలు రావడం లేదు.
విజయా సంస్థకు పాడే అదృష్టం నాక్కూడా దక్కింది. ‘భైరవద్వీపం’లో నేను పాడిన ‘నరుడా ఓ నరుడా’ పాట నాకు మంచి పేరు తెచ్చింది’’ అన్నారు. ‘‘సకుటుంబంగా చూడదగ్గ క్లాసిక్స్ నిర్మించారు నాగిరెడ్డి. ఇటీవల వచ్చిన సినిమాల్లో కుటుంబ ప్రేక్షకులను సైతం మెప్పించిన సినిమా ‘అత్తారింటికి దారేది’. ఆ చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కి నాగిరెడ్డిగారి పురస్కారం దక్కడం ముదావహం’’ అని వెంకటేశ్ అన్నారు. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే ఆణిముత్యాల్లాంటి సినిమాలు నాగిరెడ్డి నిర్మించారని తనికెళ్ల భరణి కొనియాడారు.
పురస్కార గ్రహీత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి మరీ విజయావారి సినిమాలు చూసేవాణ్ణి. నాకు సినిమాపై ఇష్టాన్ని పెంచింది విజయావారి సినిమాలే. నా తొలి సినిమా కోసం విజయా గార్డెన్స్‌లో రికార్డింగ్స్ జరిపాం. అప్పుడు నాగిరెడ్డిగారు అక్కడకొచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన అవార్డునే అందుకున్నాను’’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, బి.నాగిరెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి, మాధవపెద్ది సురేశ్, విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సీఈవో భారతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.