
అత్తారింటికి అడ్రస్ వెతుకుతున్నారు శింబు. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయా? అంటే కాదు. తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించడానికి వర్క్స్ మొదలయ్యాయి. సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
‘‘సుందర్ డైరెక్షన్‌లో శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్ మూవీ ‘మానాడు’లో నటిస్తున్నారు శింబు. ‘అత్తారింటికి దారేది’ రీమేక్ జనవరిలో రిలీజ్ అంటే.. ఈ రెండు సినిమాల చిత్రీకరణలతో శింబు బిజీగా ఉంటారన్న మాట.