
కథంతా బాహుబలి–2లోనే..
బాహుబలి చిత్రానికి ఎక్స్‌టెన్షన్ బాహుబలి–2 అని ఆ చిత్ర సృష్టికర్త రాజమౌళి పేర్కొన్నారు. బ్రహ్మాండానికి మారుపేరుగా తెర కెక్కిన బాహుబలి చిత్రం 2015లో తెరపైకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా విజయ విహారం చేసింది. హాలీవుడ్ సినిమానే తిరిగి చూసేలా చేసిన ఆ చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి–2 అత్యంత భారీ అంచనాల నడుమ ఈ నెల 28న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది బాహుబలి చిత్రాన్ని మించి అభిమానుల్ని అలరిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు రాజమౌళి వ్యక్తం చేస్తున్నారు.
తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో భారతీయ సినీ పరిశ్రమలోని పలువురు అతిరథమహారథులు అతిథులుగా పాల్గొనగా భారీ ఎత్తున్న నిర్వహించారు. అంతకు ముందు చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం ఒక నక్షత్ర హోటల్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ బాహుబలిని ఒక విజయవంతమైన చిత్రంగా తూపొందించడానికి కృషి చేశాం.కానీ ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదన్నారు.
అయితే ఆ చిత్రాన్ని ఒక్క భాషకు చెందిన చిత్రంగా కాకుండా యూనివర్సల్‌గా ఉండాలని భావించామని తెలిపారు. ఈ కథను ఒక్క చిత్రంగా రూపొందించడం సాధ్యం కాకే రెండు భాగాలుగా తెరకెక్కించామని, అంతే కానీ కథలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. అయితే రెండవ భాగంలో పోరు దృశ్యాలను, గ్రాఫిక్స్ వర్కును మరింత గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు.
బాహుబలి–3 ఉండదు
బాహుబలి–3 తీస్తారా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉండదన్నారు. అయితే బాహుబలి పలు విధాలుగా రూపొందే అవకాశం ఉందన్నారు. అది నవల కావచ్చు, సీరియల్ కావచ్చు, యానిమేషన్ రూపంలోనూ తీసుకోచ్చే ఆలోచన ఉందని దర్శకుడు తెలిపారు. తదుపరి చిత్రాన్ని కూడా బాహుబలి తరహాలో చేస్తారా? అన్న ప్రశ్నకు అది సాధ్యం అవుతుందో, లేదోనని అన్నారు.
ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. అన్ని రోజులు పని చేయడానికి నటీనటులు, సాంకేతిక వర్గం కావాల్సి ఉంటుందన్నారు. అందువల్ల తన తదుపరి చిత్రం చిన్నదైనా, పెద్దదైనా గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లేకుండా చేయాలని భావిస్తున్నానని బాహుబలి 1, 2 భాగాలను తెరకె క్కించిన శిల్పి జక్కన్న పేర్కొన్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ట, నాజర్ పాల్గొన్నారు.
అసలు కథ రెండవ భాగంలోనే..
బాహుబలి చిత్రం స్థాయిలో సీక్వెల్ ఉంటుందా?అన్న ప్రశ్నకు బాహుబలి చిత్రంలో పాత్రలను మాత్రమే పరిచయం చేశామని అసలు బలమైన కథ అంతా బాహుబలి–2లోనే ఉంటుందని చెప్పారు.
నటి అనుష్క బరువు తగ్గడంతో ఆమెను స్లిమ్‌గా చూపించడానికి గ్రాఫిక్స్ సన్నివేశాలను అధికంగా వాడినట్లు ప్రచారం జరుగుతుందన్న ప్రశ్నకు షూటింగ్ రోజులు అధికం కావడంతో సహజంగానే మనుష్యుల్లో మార్పులు జరుగుతాయని, అందులోనూ అనుష్క మధ్యలో ఒక చిత్రం కోసం బరువు పెరగాల్సి రావడంతో కొన్ని సన్నివేశాలకు గ్రాఫిక్స్ వాడిన మాట నిజమే గానీ బాహుబలి–2కు సంబంధించిన అ«ధిక భాగం చిత్రీకరణను ముందుగానే పూర్తి చేశామని తెలిపారు.అదే విధంగా చిత్ర రెండవ భాగంలో తమన్నా భాగస్వామ్యం ఉన్నా అనుష్క పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుందని చెప్పారు.