బిగ్‌బాస్‌: బాబు గోగినేని ఔట్‌ | Is Babu Gogineni Out From Bigg Boss 2 Telugu | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 12 2018 5:17 PM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Is Babu Gogineni Out From Bigg Boss 2 Telugu - Sakshi

అందరూ అనుకున్నదే జరిగింది.. బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు కౌశల్‌ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్‌ ఫాలోవర్స్‌కు బాబుపై వ్యతిరేకత చూపించారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లాలి? అని డిసైడ్‌ చేసే కౌశల్‌ ఆర్మీ ఈ సారి బాబును బయటకు పంపేసింది.

హౌజ్‌లో అందరితో కలిసి ఉన్నట్లు కనిపించే బాబు.. కౌశల్‌ విషయం వచ్చేసరికి మాత్రం అమాంతం ఎగిరిపడేవారు. కౌశల్‌తో ఢీ అంటే ఢీ అనేవారు. ఇక ఈ వారం జరిగిన షోలో మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు రగిలింది. అమ్మాయిలకు రావాల్సిన డబ్బును దొంగలించాడని కౌశల్‌ను దొంగ అంటూ నిందించారు. గత వారాలన్నింటిలో కౌశల్‌ను టార్గెట్‌ చేసిన బాబు గోగినేని .. ఒకానొక దశలో కౌశల్‌ అయినా ఉండాలి నేనైనా ఉండాలి అంటూ ఆవేశపూరితంగా చెప్పుకొచ్చాడు. ఒక వేళ తాను వెళితే .. కౌశల్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ విషయంలో బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాని మందలిస్తూ.. ఎవరు ఎవరిని బయటకు పంపలేరని, అది ప్రేక్షకుల చేతిలో ఉందంటూ.. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారమే బాబు హౌజ్‌ నుంచి బయటకు వెళతారని పలువురు భావించారు. అయితే గతవారం నందిని రాయ్‌ బయటకు వెళ్లడంతో బాబు గోగినేని ఎలిమినేట్‌ కావడానికి వారం మాత్రమే ఆలస్యమైంది.

ఇక ఎలిమినేషన్‌ విషయాన్ని పక్కనపెడితే.. ఆదివారం షో ఆద్యంతం వినోదభరితంగా జరిగింది. హౌజ్‌ మేట్స్‌ను  రెండు గ్రూపులుగా విడగొట్టిన నాని.. వారితో సరదాగా ఆట ఆడించాడు. మధ్యలో నాని కూడా వాళ్లతో కలిసి ఆడాడు. వారి ముందు ఓ రెండు చీటిల డబ్బాను పెట్టారు. ఒక గ్రూపులోని సభ్యుడి వచ్చి దాంట్లోంచి ఒక్కో డబ్బాల్లోంచి ఒక్కో చీటి తీసి అందులో ఉన్న దాన్ని.. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై  బొమ్మను గీసి వారి మిగతా సభ్యులతో ఆ చీటిలో వచ్చిందేమిటో చెప్పించాలి. ఇక ఆట పేరు బొమ్మను గీస్తే.. అంటూ నాని ఆటను మొదలుపెట్టారు. 

ఈ ఆటలో హౌజ్‌మేట్స్‌ తమ చిత్రకళను ప్రదర్శించారు. ఒక్కొక్కరు సంబంధం లేని చిత్రాలను గీసి ప్రేక్షకులను నవ్వించారు. వారికి వచ్చిన సామెతలకు, సినిమా పేర్లకు వారు గీసిన బొమ్మలకు పొంతన లేకపోయినా.. మిగతా సభ్యులు అతి కష్టం మీద వాటిని గుర్తించారు. ఈ క్రమంలో హౌజ్‌ అంతా నవ్వులు పూశాయి. కౌశల్‌కు గంగోత్రి అనే చీటి రాగా.. దానికోసం ఏదో ఒక మనిషి బొమ్మ గీసి... నీటి అలలను గీస్తే.. వాటితో అన్ని నదుల పేర్లు చెప్పుకుంటూ వచ్చి.. చివరకు గంగోత్రి వద్ద ఆగారు. ఇక అమిత్‌కు తెలుగు సరిగా చదవడం రాకపోయే సరికి.. తనకు వచ్చిన చీటికి, గీసిన బొమ్మకు సంబంధం లేకుండాపోయింది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.. అని వస్తే.. చూసి రమ్మంటే కలిసి వచ్చాడు అని పొరపడి తనకు ఇష్టం వచ్చినట్లుగా బొమ్మను గీసేసరికి.. మిగతా సభ్యులు అదెంటో కనిపెట్టలేకపోయారు. 

ఇక దీప్తి సునయనకు వచ్చిన కాకి పిల్ల కాకికి ముద్దు, ఆవిడా మా ఆవిడే.. లాంటి వాటికి దీప్తి సునయన గీసిన బొమ్మలకు సంబంధం లేకపోయినా.. వాటిని ఎలాగోలా కష్టపడి చెప్పేశారు. ఆవిడా మా ఆవిడే.. అనే దానికి నాని హెల్ప్‌ను కూడా ఆశ్రయించింది. నాని చెప్పిన క్లూతో కాకుండా ఏవో బొమ్మలు వేయగా.. శ్యామల మాత్రమే సరైన సమాధానాన్ని చెప్పగా.. హౌజ్‌మేట్స్‌తో పాటు నాని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఆస్కార్‌ ఇవ్వాలంటూ శ్యామలను ఆటపట్టించాడు. 

బొమ్మరిల్లు, ఇల్లు అలకగానే పండుగ కాదు, మాంగళ్య బలం ఇలా ఇంటరెస్టింగ్‌గా వచ్చిన చీటిలతో హౌజ్‌మేట్స్‌ చేసిన సందడితో హౌజ్‌తో పాటు ప్రేక్షకులకు కావల్సినంత మజా వచ్చేసింది. ఇక నాని గీసిన హౌజ్‌మేట్స్‌ బొమ్మలను మాత్రం వారు ఇట్టే గుర్తు పట్టేశారు. పొడుగ్గా బొమ్మను గీయగానే.. అది సామ్రాట్‌ అని చెప్పేశారు. బట్టతలను గుర్తుగా గీయగా అది అమిత్‌ అని, స్టైల్‌గా షేవ్‌ చేసుకున్న బొమ్మను కౌశల్‌ అని,  వెరైటీ హెయిర్‌స్టైల్‌తో గీయగా అది రోల్‌రైడా అని ఇలా ఒక్కొక్కరిని వారి ప్రత్యేకతలను హైలెట్‌ చేస్తూ నాని బొమ్మలు గీయడంతో  సరదాగా సాగిపోయింది. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో ఎలిమినేషన్‌ను గుర్తు చేశాడు నాని. ఇక హౌజ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కానీ ప్రేక్షకుల్లో మాత్రం అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలిమినేట్‌ కాబోతున్నది ఎవరో ముందే లీకైపోయింది. ఎప్పటిలాగే ఎలిమినేషన్‌ కాబోతున్నది ఎవరనేది ముందే బయటకు రావడం ఆనవాయితీగా మారింది. అయినా సరే.. బాబు గోగినేని ఏ మాట్లాడాడు.. ఈ సారి బిగ్‌బాంబ్‌ ఏంటి? అది ఎవరి మీద వేసి ఉంటాడు? అనేవి కొంత ఆసక్తికరంగా మారాయి. 

బయటకు వచ్చిన బాబు గోగినేని.. తనకు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రావడం గొప్ప అనుభూతి అని.. ఈ ఇంట్లో సరదాగా ఉన్నాను, అల్లరి చేశాను, కోపడ్డాను, నేర్చుకున్నాను... నా కంటే వయసులో చిన్నవాళ్లతో ఇన్ని రోజులు ఇలా గడపడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ హౌజ్‌మేట్స్‌తో మాట్లాడే అవకాశం నాని ఇవ్వగా.. బయటక రండి ఇక్కడ ప్రోమోలను చాలా బాగా వేశారు. తొందరగా వచ్చి మీరు కూడా మీ ప్రోమోలను చూసుకోండి అని సరదాగా అనడంతో హౌజ్‌లోని వారంతా నవ్వుకున్నారు. ఈ వారం అంతా బాత్రూమ్స్‌ను శుభ్రంగా ఉంచాలనే బిగ్‌బాంబ్‌ను.. సామ్రాట్‌ పేరు చెబుతూ.. తనకు వద్దులే ఎలాగూ బాగానే చేస్తాడు కాబట్టి.. రోల్‌రైడాకు ఇచ్చేద్దామంటూ.. అతనిపై బిగ్‌బాంబ్‌ వేశాడు. వారం మొత్తం గుర్తురాని రోల్‌.. బిగ్‌బాంబ్‌ అనే సరికి మాత్రం గుర్తొస్తున్నాడంటూ నాని అనగానే హౌజ్‌లో నవ్వులు పూశాయి. ఇక పదో వారం హౌజ్‌లో ఏ జరుగుతుందో వేచి చూడాలి. ఎదైనా జరుగొచ్చు.. ఎందుకంటే బాస్‌.. ఇది బిగ్‌బాస్‌!

చదవండి... బిగ్‌బాస్‌: తనీష్‌ నువ్వెలా బెస్ట్‌ ప్లేయర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement