ఆ ముద్దు హల్‌చల్ చేస్తోంది!
లండన్: 'టైటానిక్' హీరో లియోనార్డ్ డికాప్రియో అవార్డు ఫంక్షన్లలో ఏం చేసినా అది వైరల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల వేడుకలో ఆయనను పాప్ సింగర్ లేడీ గాగా విరుసుగా తోసుకొనిపోవడం.. అది చూసి లియోనార్డ్ బిత్తరపోవడం తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో ఆన్‌లైన్‌లో బాగానే హల్‌చల్ చేసింది. ఈసారి బాఫ్టా అవార్డుల వేడుక ఈ వైరల్‌కు వేదిక అయింది. ప్రేమికుల రోజు సందర్భంగా తొలిసారి ఈ వేడుకలో 'కిస్ క్యామ్'ను ప్రవేశపెట్టారు.
అయితే, ఊహించినట్టు ప్రేమికులుగా భావిస్తున్న మైఖేల్ ఫాస్‌బెండర్, అలిషియా వికాండర్ మాత్రం ఈ 'కిస్ క్యామ్' ఫోకస్ అయిన సందర్భంగా ముద్దు పెట్టుకోలేదు. ఇది అందరినీ ఒకింత నిరాశపరిచింది. అయితే ఈ లోటును డికాప్రియో చాలా తెలివిగా పూడ్చాడు. 81 ఏళ్ల డామ్ మ్యాగీని, 41 ఏళ్ల లియోనార్డోని ఒకేఫ్రేములో ఈ కెమెరా ఫిక్స్ చేయగానే.. ఊహించనిరీతిలో లియోనార్డో ముందుకొచ్చి మ్యాగీని ఆత్మీయంగా ముద్దాడారు. 'హ్యారీపోటర్' సినిమాలో కీలక పాత్రలో నటించిన మ్యాగీ కూడా ఈ కిస్‌ను ఆత్మీయంగా స్వీకరించారు. ఇది ఊహించినట్టే ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
'కిస్ క్యామ్'ను ఫాస్బెండర్, వికండర్ జోడీ మాత్రమే నిరాశపరిచింది. బ్రయాన్ క్రాంస్టన్-జూలియన్ మూర్, రెబెల్ విల్సన్-ఎడ్డీ ఇజార్డ్ జంటలు ఈ క్యామ్‌లో చుంబనాలతో ఆహూతులను అలరించాయి. బాఫ్టా అవార్డుల వేడుకలో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన 'రెవెనంట్' మరోసారి దుమ్మురేపింది. ఈ సినిమాను ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు వరించాయి.
Maggie Smith and Leonardo DiCaprio on the BAFTA Kiss Cam pic.twitter.com/A6TuSIdksx
— Leo DiCaprio News (@NewsDiCaprio) February 14, 2016