
బాలా
వైవిధ్యభరిత చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనే విషయం ‘బాలా’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బాలా’. భూమి పడ్నేకర్, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 7న బాలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బట్టతల ఉన్నవారి బాధలను చూపించిన ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకులు విశేషంగా ఆకర్షితులయ్యారు. బట్టతలతో హీరో పడే పాట్లు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. అమర్ కౌశక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. అక్కడితో ఆగకుండా రెండవరోజు రూ.15 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఈ ప్రయోగాత్మక చిత్రం అటు ప్రేక్షకులతోపాటు ఇటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి మార్కులే పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment