అదిరేటి స్టెప్పు మీరేస్తే...!
నందమూరి బాలకృష్ణ ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా ‘ఓ డైలాగ్ కొట్టు గురూ’ అని అభిమానులు అభిమానంగా అడుగుతారు. ఒకవేళ అదే వేదికపై జ్యోతిలక్ష్మి లాంటి ఐటమ్ డ్యాన్సర్ కూడా కనిపిస్తే, ఆమెతో కలిసి ఓ స్టెప్ వెయ్ గురూ అని అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకప్పుడు ‘జ్యోతిలక్ష్మి చీర కట్టింది... పాపం చీరకే సిగ్గేసింది..’, ‘అంతం కాదిది.. ఆరంభం.. మూడు చుక్కల ముద్దుల విందు...’, ‘పరువాల లోకం.. పడుచోళ్ల మైకం..’ వంటి ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను కనువిందు చేసిన జ్యోతిలక్ష్మిని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఆమెతో కలిసి బాలకృష్ణ నిజంగానే డ్యాన్స్ చేశారు.
ఇందుకు వేదికగా నిలిచింది ‘సంతోషం’ అవార్డుల వేడుక. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో జ్యోతిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఏయన్నార్ స్మారక అవార్డును కృష్ణంరాజు, గోల్డెన్ జూబ్లీ అవార్డును కృష్ణ, జీవిత సాఫల్య పురస్కారాన్ని విజయనిర్మల, డి. రామానాయుడు స్మారక అవార్డును అల్లు అరవింద్ , అల్లు రామ లింగయ్య స్మారక అవార్డును గొల్లపూడి మారుతీ రావు, ఈవీవీ స్మారక అవార్డును రేలంగి నరసింహా రావు అందు కున్నారు. 2014 లెజెండ్రీ అవార్డు అందుకున్న బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు తన సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పారు.
అదే అభిమానుల కోరిక మేరకు జ్యోతిలక్ష్మీతో కలిసి ‘గు గ్గు గ్గు గ్గు గ్గుడెసుంది..’ పాటకు స్టెప్పులు వేశారు. అదిరేటి ఈ స్టెప్పులు అవార్డు వేడుకకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాయని ‘సంతోషం’ సురేశ్ కొండేటి పేర్కొన్నారు. ఇంకా కథానాయిక శ్రీయ చేసిన డ్యాన్స్ కూడా వీక్షకులను అలరించింది. ఈ వేడుకలో నటులు మురళీ మోహన్, రామ్‌చరణ్, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, ఎన్. శంకర్, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పలువురు తారలకు అవార్డులు అందజేశారు.