సింగర్‌గా డిక్టేటర్? | Balakrishna Turns Singer In Dictator | Sakshi
Sakshi News home page

సింగర్‌గా డిక్టేటర్?

Published Tue, Jul 7 2015 10:42 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

సింగర్‌గా డిక్టేటర్? - Sakshi

సింగర్‌గా డిక్టేటర్?

నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా ‘డిక్టేటర్’ సెట్స్ మీదకెళుతోంది. ఇటీవలే ‘లౌక్యం’తో బంపర్ హిట్ సాధించిన శ్రీవాస్, ఇందులో బాలకృష్ణను సరికొత్త రీతిలో ఆవిష్కరించనున్నారు. నందమూరి అభిమానులతో పాటు మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం కోసం కోన వెంకట్, గోపీ మోహన్ తదితర రచయితల బృందంతో కలిసి శ్రీవాస్ పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఫిలిమ్‌నగర్‌లో తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే - ఇందులో బాలకృష్ణతో పాట పాడించనున్నారట.
 
 ఆ మధ్య ఉత్తరాంధ్ర తుఫాన్ బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన ‘మేము సైతం...’ చారిటీ షోలో మొదటిసారిగా బాలకృష్ణ గొంతు విప్పి, అందరినీ ఆశ్చర్యపరిచారు. దానికి తోడు సంగీత దర్శకుడు తమన్ తన ప్రతి సినిమాలోనూ ఆయా హీరోతో పాట పాడించే ప్రయత్నం చేస్తుంటారు. ‘పవర్’ సినిమాలో ‘నోటంకీ నోటంకీ’ అని రవితేజతో, ‘రభస’లో ‘రాకాసి... రాకాసి’ అంటూ చిన్న ఎన్టీఆర్‌తో పాటలు పాడించి అభిమానులను ఉర్రూతలూగించారు.
 
 గత అనుభవం దృష్ట్యా ఈసారి బాలయ్యతోనూ తమన్ పాట పాడిస్తారట. చిత్ర బృందం కూడా ఈ విషయమై చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. తమన్ కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ‘‘బాలకృష్ణగారితో ఈ సినిమాలో పాట పాడించాలని అనుకుంటున్నా. ఆయన  పాడే పాట నా కెరీర్‌లో కచ్చితంగా ఓ హిట్ సాంగ్ అవుతుంది’’ అని ఆనందం వెలిబుచ్చారు తమన్. ఇప్పటికే తమన్ ఆధ్వర్యంలో రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement