తమిళ సినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవానం ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్న సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్.
మలయాళంలో మమ్ముట్టి, నయనతారలతో నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. చిత్ర తమిళం రీమేక్‌లో అజిత్‌ను, ఆ తరువాత రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. చిత్రం చూసిన రజనీకాంత్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే ఆయన కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించలేకపోయారు. ఆ పాత్రలో ఇప్పుడు అరవిందస్వామి నటిస్తున్నారు.
హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా, నయనతారలో ఒకరిని నటింపజేయాలని ప్రయత్నించినా, చివరికి ఆ అవకాశం నటి అమలాపాల్‌ను వరించింది. నటి మీనా కూతురు నైనిక, మాస్టర్ రఘువరన్, నటి నికీషాపటేల్ ప్రముఖ పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రేష్ సంగీతం అందిస్తున్నారు.
ఈయన ప్రముఖ నటి జయచిత్ర వారసుడన్నది తెలిసిన విషయమే. అమ్రేష్ ఇంతకు ముందు లారెన్స్ నటించిన మొట్టశివ కట్టశివ చిత్రానికి సంగీతం అందించారు. ఆ చిత్రంలోని పాటలు కమర్షియల్ ఫార్ములాలో ఫాస్ట్ బీట్‌లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా అలరించాయి. కాగా ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రను పోషిస్తున్న గర్జణై, ప్రభుదేవా, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, భరత్ హీరోగా పొటు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఈయన సంగీతబాణీలు కడుతున్న ఆ భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాన్ని హర్షిణి ఫిలింస్ పతాకంపై ఏ.హర్షిణి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment