బిగ్‌బాస్‌ : అనుకోని సంఘటన.. దీప్తికి షాక్‌! | Bigg Boss 2 Telugu Deepthi Nallamothu Sacked from Captain Position | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 26 2018 9:33 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Deepthi Nallamothu Sacked from Captain Position - Sakshi

బిగ్‌బాస్‌ షో ఈ వారం మొత్తం మజా ఇవ్వకపోయినా.. శనివారం షోలో జరిగిన సంఘటనలు మాత్రం ప్రేక్షకులకు కావల్సినంత కిక్కునిచ్చేశాయి. ఎంతో ఆశపడి కెప్టెన్సీ బాధ్యతను చేపట్టిన దీప్తికి బిగ్‌బాస్‌ గట్టి షాకే ఇచ్చాడు. కౌశల్‌-తనీష్‌ల గొడవతో హౌస్‌ వేడెక్కిపోయింది. అమిత్‌ వేసే వేశాలను నాని ఎండగట్టేశాడు. హౌస్‌లో ఒంటరిగా ఏవేవో మాట్లాడుకుంటున్న వీడియోలు చూపించి గణేష్‌ గాలి మొత్తం తీసేశాడు నాని. ఇలా ఒకటేమిటి షో మొత్తం అదిరిపోయింది. అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం. 

హౌస్‌లో ఇన్ని రోజులుగా హెచ్చరిస్తున్నా... మైక్‌లు ధరించకుండా మాట్లాడటం, పగటి పూట నిద్ర పోవడం, కెప్టెనే స్వయంగా మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో విసుగు చెందిన బిగ్‌బాస్‌ దీప్తిని కెప్టెన్‌ బాధ్యత నుంచి తొలగించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. లేకలేక వచ్చిన కెప్టెన్‌ పదవిని ఇలా సంబరపడేలోపే పోగొట్టుకుంది దీప్తి. ఇక బిగ్‌బాస్‌ కెప్టెన్‌గా తొలగించినప్పటికీ.. తానే కెప్టెన్‌ అని తాను చెప్పిందే వింటానని ఇది తన అభిప్రాయమని తనీష్‌ చెప్పడం ప్రేక్షకులకు విడ్డూరంగా అనిపించింది. 

డైనింగ్‌ టేబుల్‌ వద్ద మొదలైన జగడం...

బిగ్‌బాస్‌ ఇలా ఆదేశించిన తరవాత.. కౌశల్‌ తన వాదనను వినిపించాడు. అది మాటామాటా పెరిగి పెద్ద యుద్ధం లాంటిదే జరిగింది. టాపిక్‌ ఎక్కడికో వెళ్లి.. కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లి ఎందుకు పడుకున్నావంటూ తనీష్‌ను ప్రశ్నించేసరికి.. అంతెత్తుకు లేచి కౌశల్‌పై మండిపడ్డాడు. గొడవ మొదలైందే.. గణేష్‌ నిద్రపోవడం, రోల్‌ రైడా, దీప్తి మైక్‌లు ధరించకపోవడం వల్ల అయితే వీరిద్దరు మాటల యుద్దానికి దిగగా.. మిగతా వారంతా వీరిద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించారు. 

బట్టబయలైన అమిత్‌ రంగు...


మొదట్నుంచీ సేఫ్‌ గేమ్‌ ఆడుతూ.. ఎవరిని నొప్పించకుండా.. ఆడే అమిత్‌ ఈసారి దొరికిపోయాడు. కెప్టెన్సీ టాస్క్‌లో కౌశల్‌కు సపోర్ట్‌ చేసి.. కొద్దిసేపట్లోనే అదంతా పోగొట్టేసుకున్నాడంటూ నాని పాయింట్‌ అవుట్‌ చేశాడు. అయితే కౌశల్‌కు సపోర్ట్‌ చేసి.. మళ్లీ ఆ రాత్రే వాటి మీద జోక్‌లు వేసుకోవడంతో తాను చేసిన సపోర్ట్‌కు ఎలాంటి ఉపయోగం ఉండకుండాపోయిందని అమిత్‌కు సలహా ఇచ్చాడు. అయితే అమిత్‌ మాత్రం.. ఎప్పుడు మాట్లాడనంటూ బుకాయించాడు.. వీడియో చూపించడం ఎందుకులే.. మీరు ఒకరి దగ్గర ఏం మాట్లాడుతుంటారు.. మళ్లీ వేరొకరి దగ్గర ఆ మనిషి గురించి ఏం మాట్లాడుతుంటారో ఆ మనిషికి తెలియకపోవచ్చు.. కానీ మాకు తెలుస్తుందంటూ నాని కౌంటర్‌ వేశాడు. అలా మాటలు మార్చే వారినే జడ్జ్‌ చేస్తామంటూ అమిత్‌ను హెచ్చరించాడు. 

తనీష్‌ను హెచ్చరించిన నాని

డైనింగ్‌ టేబుల్‌ వద్ద మొదలైన గొడవను మళ్లీ నాని లేవనెత్తాడు. కౌశల్‌, తనీష్‌లు తమ వాదనలు వినిపించారు. మళ్లీ అక్కడ కూడా వారి వ్యవహారం శృతిమించడంతో నాని హెచ్చరించాడు. తనకు లాజిక్‌ లేనప్పుడు, ఆన్సర్‌ చేయలేనప్పుడే.. అలా కోపంతో ఉవ్వెత్తున లేస్తాడంటూ తనీష్‌ను హెచ్చరించాడు. రూల్స్‌ బ్రేక్‌ చేస్తాం.. పనిష్మెంట్స్‌ వస్తే.. ఫేస్‌ చేస్తామనే యాటిట్యుడే కరెక్ట్‌ కాదంటూ.. తనీష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. మాట్లాడాల్సిన వారు మాట్లాడకుండా.. అవసరం లేని వాళ్లు అనవసరంగా మాటల యుద్ధానికి దిగారంటూ.. అనవసరమైన చోట మాట్లాడకుండా ఉంటే మంచిదని కౌశల్‌కు సలహా ఇచ్చాడు. 

గీతకు నాని సలహా.. 
తాను గేమ్‌ను లైట్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోందని.. బిగ్‌బాస్‌ రూల్స్‌ అంటే లెక్కలేనితనం పెరిగిపోయిందంటూ గీతకు వార్నింగ్‌ ఇచ్చాడు. అది సరైన ప్రవర్తన కాదంటూ సలహా ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌తో అలా అన్నానని, కౌశల్‌నుంచి తప్పించుకోలేక.. అతను నన్ను ప్రభావితం చేస్తున్నట్టుగా అనిపిస్తోందని.. ఆయన ప్రతీసారి నా దగ్గరికి వచ్చి ఏదోటి చెప్పడంతో నాలో నెగెటివిటి పెరిగిపోతున్నట్టు అనిపిస్తోందంటూ... ఇలా తన కారణాలను చెప్పుకుంది. 

ఫోన్‌ కాల్‌.. ఆనందంతో కౌశల్‌ కంటతడి

ప్రతీవారం ఒక కాలర్‌ హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతుండగా.. ఈసారి కౌశల్‌కు కాల్‌ వచ్చింది. కౌశల్‌కు ఫోన్‌ ఇవ్వగానే కాలర్‌ మాట్లాడటంతో కంటతడి పెట్టుకున్నాడు. కౌశల్‌ అన్నకు ఫోన్‌ ఇవ్వమని కాలర్‌ అడగడం.. కౌశల్‌ ఆశ్చర్య పడటం.. కౌశల్‌ ఆర్మీ గురించి వివరించడం.. భరోసా ఇవ్వడం..కౌశల్‌ ఒంటరి కాదు.. తనకు బయట ఉన్న ఫాలోయింగ్‌ గురించి చెప్పడం... నీ ఆట నువ్వు ఆడుకో.. మిగతాది ఆర్మీ చూసుకుంటుందని చెప్పడం.. బిగ్‌బాస్‌ విజేతగా నిలవాలని కోరుకోవడం.. తాను కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని బదులివ్వడం.. ఇలా ఆనందంతో కౌశల్‌ కళ్లు తడిశాయి. 

ఇ​క కాల్‌ కట్‌ అవడంతో.. బయట జరిగేదంతా చెప్పేశాడని.. చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పాడని అన్నాడు. ఒంటరి వాడని బాధపడకంటూ.. బయట ఏ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉందో అర్థమైంది కదా అంటూ కౌశల్‌కు ధైర్యం చెప్పాడు. తనకు ఇన్ని సలహాలు ఇస్తూ.. ప్రోత్సహిస్తున్న నానికి కౌశల్‌ ధన్యవాదాలు తెలిపాడు.

మైక్‌ తీసి పిచ్చిపిచ్చిగా మాట్లాడిన గణేష్‌

గణేష్‌ ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ.. తన ఆరోగ్యం కూడా చూసుకోలేని వాడు..బిగ్‌బాస్‌ టైటిల్‌ ఏం గెలుస్తాడంటూ గణేష్‌ను మందలించాడు. ఎప్పుడూ నిద్ర ఎందుకు పోతున్నావంటూ ప్రశ్నించంగా.. అలసిపోవడం వల్ల అప్పుడప్పుడు పడుకుంటున్నానని సమాధానమివ్వగా.. గణేష్‌ ఒంటరిగా ఉండి.. ఏదో తనలో తాను మాట్లాడుకోవడం.. మైక్‌ తీసేసి ఏదో తిట్టినట్టు మాట్లాడుకుంటున్న వీడియో ప్లే చేసేసరికి హౌస్‌లో నవ్వులు పూశాయి. జిమ్‌ ఏరియాలో మాట్లాడుతూ అలసిపోతున్నావా? అంటూ గణేష్‌ను మందలించాడు. తనను ట్రీట్‌ చేసే డాక్టర్‌ కూడా రావడానికి ఇష్టపడటం లేదంటూ.. తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదంటూ.. కేవలం కామన్‌ మ్యాన్‌అనే ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్నావని, ఇదే సెలబ్రిటీ అయితే ఈపాటికే ఇంట్లోంచి పంపించేసేవారని గణేష్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. 

ఇక అసలైన ఎలిమినేషను మాత్రం సస్పెన్స్‌లో ఉంచేసిన నాని.. కనీసం ప్రొటెక్షన్‌ జోన్‌లో ఎవరున్నారనే విషయాన్ని కూడా ప్రకటించకుండా ఉత్కంఠరేగేలా చేశాడు నాని. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం పూజ, దీప్తిలు ఎలిమినేట్‌ అయినట్టు కనిపిస్తోంది. దీప్తికి తక్కువ ఓట్లు రావడంతో.. తనను ఎలిమినేట్‌ చేసే భాగంలోనే కెప్టెన్‌ బాధ్యతలనుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఒక్కరే ఎలిమినేట్‌ అయ్యారా? లేక ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారా?చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు కదా.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్‌.

చదవండి.. బిగ్‌బాస్‌ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement