బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..! | Bigg Boss 3 Telugu: Three Strong Contestants Safe In 13th Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

Published Sun, Oct 20 2019 11:19 AM | Last Updated on Tue, Oct 22 2019 10:51 AM

Bigg Boss 3 Telugu: Three Strong Contestants Safe In 13th Week - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో చూస్తుండగానే తొంభై రోజులు గడిచిపోయాయి. ఇక వీకెండ్‌లో వచ్చిన నాగార్జున ఇంటిసభ్యుల గొడవలను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అనంతరం వారితో.. చిచ్చు రేపిన నామినేషన్‌ టాస్క్‌నే మళ్లీ ఆడించడం ఆసక్తి రేపింది. ఇంట్లో తమ స్థానాలను తెలిపే నెంబర్స్‌ను ఎంచుకోమనగా శ్రీముఖి, శివజ్యోతి 1, అలీ రెజా..2,  బాబా భాస్కర్‌, వితిక..3, రాహుల్‌..4, వరుణ్‌ 7 స్థానాలను ఇచ్చుకున్నారు. ఇక శ్రీముఖి, రాహుల్‌ల లొల్లి మళ్లీ మొదలైంది. బిగ్‌బాస్‌ షోకు తనను శ్రీముఖే రికమెండ్‌ చేసిందని చెప్పుకుంటోందని రాహుల్‌ నాగార్జున దగ్గర వాపోయాడు. వితిక తనకీ విషయం చెప్పిందని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ‘రికమెండ్‌ చేయడానికి నేనెవర్ని.. అసలు ఆ మాటే అనలేదు’ అని శ్రీముఖి కరాఖండిగా చెప్పింది. దీనిపై నాగార్జున వితికను ప్రశ్నించగా తాను అలా చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంపై రాహుల్‌ ఎంతకూ వెనక్కు తగ్గలేదు. తాను చెప్పింది అబద్ధం అని తేలితే తక్షణమే షో నుంచి వెళ్లిపోతానంటూ శపథం చేశాడు. మీ మధ్య మిస్‌ కమ్యూనికేషన్‌ జరిగింది అంటూ నాగ్‌ ఈ విషయాన్ని పక్కన పెట్టేశాడు.

ఇక ఇంటి సభ్యులతో కాకుండా వారి కుటుంబ సభ్యులతో నాగ్‌ టాస్క్‌ ఆడించాడు. అందులో భాగంగా వచ్చిన వాళ్లు ఇంట్లో ఎవరు చివరి స్థానాల్లో ఉన్నారని చెప్పమనగా మెజారిటీ  సభ్యులు అలీ, వితికలు వెళ్లిపోవాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. వచ్చిన బంధువులు ఇంటి సభ్యుల కోసం గిఫ్ట్‌లు తీసుకుచ్చారు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ రాములమ్మను బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. ఆమె కోసం తెచ్చిన టెడ్డీబేర్‌ గిఫ్ట్‌ను రాహుల్‌ ఓపెన్‌ చేయగా.. అతని చేతుల మీదుగా శ్రీముఖి సేవ్‌ అయింది.  శివజ్యోతి అక్క స్వప్న నాగార్జునను చూసి సర్‌ప్రైజ్‌ అయింది. ఇక వితిక తల్లి తన అల్లుడే ఎక్కువ మంచోడంటూ వరుణ్‌కు ఓటు వేసింది. వితికను చూడగానే ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్‌బాస్‌ అయిపోయాక ఇంటికి వస్తే అందరికీ భీమవరం వంట చేసిపెడతానని ఆఫర్‌ ఇచ్చింది.

అనంతరం అలీ స్నేహితుడు యాంకర్‌ రవి షోలో పంచ్‌లు పేల్చుతూ ఎంటర్‌టైన్‌ చేశాడు. శ్రీముఖిని బాగా మిస్‌ అవుతున్నానని రవి చెప్పుకొచ్చాడు. రాహుల్‌ మిత్రుడు.. సింగర్‌ నోయెల్‌ వచ్చి అతనిలో కొత్త హుషారును నింపాడు. ఇక నుంచి రాహుల్‌ 2.0 చూడాలని కోరాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ కొట్టాలంటూ రాహుల్‌ కోసం ఉరకలెత్తించే పాట పాడాడు. అనంతరం ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్‌ అక్క శోభన కాస్త ఎమోషనల్‌ అవుతూనే, బాబా మంచివాడంటూ చెప్పుకొచ్చింది. అనంతరం అలీ చేతుల మీదుగా బాబా సేవ్‌ అయ్యారు. షోకు వచ్చిన గెస్ట్‌లు ఎక్కువమంది అలీ, వితికలు టాప్‌ 5లో ఉండే అర్హత లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. శ్రీముఖి, రాహుల్‌ ,బాబా భాస్కర్‌ సేఫ్‌ అయ్యారు. మరి మిగిలిన నలుగురిలో బయటకు వెళ్లేది వితికేనా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement