ముంబై: సీనియర్ నటుడు ఆదిత్య పంచోలిపై ఫిర్యాదు చేసిన బాలీవుడ్ నటి దిగ్బ్రాంతికర విషయాలు వెల్లడించారు. పంచోలి తనపై సాగించిన దారుణాలను వెర్సోవా పోలీసులకు ఇచ్చిన రెండున్నర పేజీల వాంగ్మూలంలో వివరించారు. అతడి ఆగడాలపై 2004-06లో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. తన సోదరిని కూడా చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తెలిపారు.
‘బాలీవుడ్‌లో రాణించాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టిన నాకు ఆ ఏడాది ఆదిత్య పంచోలి పరిచయమయ్యాడు. అప్పటికి అతడికి వయసు 38 ఏళ్లు. నా కంటే 22 ఏళ్లు పెద్దవాడు. అతడికి పెళ్లైపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడి కూతురిది నా వయసే. 2004లో ఓరోజు అతడితో కలిసి పార్టీకి వెళ్లాను. పార్టీలో డ్రింక్ తాగిన తర్వాత మత్తుగా అనిపించింది. అందులో ఏదో కలిపారన్న అనుమానం కలిగింది. పార్టీ ముగిసిన తర్వాత నన్ను హాస్టల్ దగ్గర దిగబెడతానని అడగడంతో అతడి రేంజ్ రోవర్ కారులో ఎక్కాను. కొంత దూరం వెళ్లాక యారీ ప్రాంతంలో కారు ఆపేసి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దురాగతాన్ని ఫొటోలు తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. తనకు భార్యలా ఉండాలని ఒత్తిడి చేసేవాడు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివని, నా వయసుకు తగినవాడిని పెళ్లి చేసుకుంటానని బతిమాలినా కరగలేదు. ఫొటోలు బయటపెడతానని భయపెట్టేవాడు. అప్పుడు నేను చిన్నదాన్ని. ముంబైలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు.
పంచోలి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఆటోను మధ్యలో ఆపేసి విచక్షణారహితంగా కొట్టాడు. బిపిన్ బిహారి అనే సీనియర్ పోలీసు అధికారిని కలిసి నా గోడు చెప్పుకున్నాను. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు 2004-05లో మా ఆంటీతో కలిసి పల్లవి అపార్ట్‌మెంట్‌కు మారిపోయాను. తన స్నేహితులతో కలిసి అక్కడికీ వచ్చి రభస చేశాడు. ప్రతిసారి తనతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చేవాడు. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. 2006-07లో వెర్సోవాలో అపార్ట్‌మెంట్ కొనుక్కుని ఒంటరి జీవితం గడుపుతుండగా అక్కడికీ వచ్చాడు. పీకలదాకా తాగి నకిలీ తాళంతో నా ఇంట్లోకి చొరబడి వస్తువులన్నింటిని ధ్వంసం చేసి నన్ను చిత్రహింసలు పెట్టేవాడు.
అతడి పెట్టే బాధలు తట్టుకోలేక 2008-09లో బాంద్రాకు మారిపోయాను. అక్కడికీ ప్రతక్షమయ్యాడు. ఆరోగ్యం బాలేక నా దగ్గర ఉండేందుకు వచ్చిన మా సోదరిపై చేయి చేసుకున్నాడు. ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావని ఫోన్ చేసి అడిగితే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ. 50 లక్షలు ఇవ్వడంతో కొద్దిరోజుల పాటు శాంతించాడు. నాకు అవకాశాలు పెరిగి గుర్తింపు రావడంతో మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టాడు. తనదగ్గరున్న ఫొటోలు మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు పంపుతానని బెదిరింపులకు దిగాడ’ని బాధితురాలు వివరించారు.
బాధితురాలి సోదరి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఆదిత్య పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుస్తు బెయిల్ కోసం కోర్టును అతడు ఆశ్రయించగా జూలై 19 వరకు అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం ఆదేశాల్చింది. ప్రతి బుధ, శనివారాల్లో వెర్సోవా పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. కాగా, తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తాను ఏ తప్పు చేయలేదని ఆదిత్య పంచోలి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment