'నానా'గొడవ | Bollywood comes out in support of Tanushree Dutta | Sakshi
Sakshi News home page

'నానా'గొడవ

Published Sat, Sep 29 2018 12:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Bollywood comes out in support of Tanushree Dutta - Sakshi

అమ్మాయి రంగు పూసుకుంటే.. పవిత్రతను తుడిచేసుకున్నట్టేనా?కెమెరా ముందు నిలబడితే.. మగాడి కంటికి క్యారెక్టర్‌ లేనట్టు కనబడటమేనా?పాత్రకు న్యాయం చే స్తే.. తనకు తను అన్యాయం చేసుకోవడమేనా?డబ్బు తీసుకుంటే  అమ్ముడు పోయినట్టేనా? ఇవేవీ మగాడికి వర్తించవా?సినిమా సమాజాన్ని తరచూ వెక్కిరిస్తున్న ఈ సంఘటనలకు ఎప్పటికైనా ఒక సమాధానం దొరకాలని.. సినిమా కూడా ఒక ప్రొఫెషన్‌ అని..  మనందరం చేస్తోన్న ఉద్యోగం లాంటిదేనని.. గుర్తించాల్సిన అవసరం లేదా?

హార్న్‌ ఓకే ప్లీజ్‌... సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మోగలేదు. నిశ్శబ్దంగా తెరపైకి వచ్చి, అంతే నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. కానీ ఆ సినిమా పేరు ఇప్పుడు మోత మోగిపోతోంది. ఆ చిత్రంలో తనతో పాటు నటించిన నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు పెద్ద సౌండ్‌ చేస్తున్నాయి. తనుశ్రీకి అండగా కొన్ని గొంతులు కలిశాయి. ‘ఇలాంటివి జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి ప్లీజ్‌’ అంటూ చిన్న తారల నుంచి పెద్ద తారల వరకూ గొంతు విప్పారు. అసలేం జరిగిందంటే...

అది 2008. ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సెట్‌. పాట చిత్రీకరణకు అంతా రెడీ చేశారు. జూనియర్‌ డ్యాన్సర్స్‌ అందరూ షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పక్కనే హీరోయిన్‌ తనుశ్రీ దత్తా అప్‌సెట్‌ అయి కూర్చొని ఉన్నారు. షూటింగ్‌ ఎందుకు ఆగిపోయింది? అని ఎవరో అడిగితే ‘యూనిట్‌ని హీరోయిన్‌ ఇబ్బంది పెడుతోందట’ అని సమాధానం వినిపించింది. కొద్ది సేపటి తర్వాత  షూటింగ్‌ మళ్లీ స్టార్ట్‌ అయింది. కొన్ని షాట్స్‌ తీసిన తర్వాత తనుశ్రీ అర్ధంతరంగా షాట్‌ మధ్యలో వెళ్లిపోయి, కేరవాన్‌లో కూర్చున్నారు. కొద్దిసేపటికి కొందరు రౌడీలు వచ్చి తనుశ్రీ కేరవాన్‌ డోర్‌ కొడుతున్నారు. సెట్లో అంతా గందరగోళం.  ఈలోపు తనుశ్రీ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్లు వెళ్తున్న కారు అద్దాలను బద్దలుకొట్టారు. నానా రభస చేశారు. ఇదంతా బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ జానిస్‌ సీక్వెరా ఇప్పుడు బయటపెట్టారు. ఆమె ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేసుకోవడానికి కారణం తనుశ్రీ చేసిన ఆరోపణలే.

2009లో ఇండస్ట్రీని విడిచి వెళ్లిన తనుశ్రీ దత్తా ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సమయంలో నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల ఆరోపించారు. అలాగే దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ‘చాక్లెట్‌’ సెట్లో ఇబ్బందికర పరిస్థితి తీసుకువచ్చాడని కూడా ఆరోపించారు. ఈ విషయం గురించి తనుశ్రీ మాట్లాడుతూ –  ‘‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమాలో పాట కోసం మూడు రోజులు రిహార్సల్స్‌ చేశాం. షూటింగ్‌ రోజు సడెన్‌గా కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య మూడు రోజులుగా ప్రాక్టీస్‌ చేసిన స్టెప్స్‌ అన్నీ మార్చేశాడు. స్క్రిప్ట్‌ ప్రకారం ఆ పాటలో నానా పటేకర్‌ లేడు. కానీ చివరి నిమిషంలో ప్రొడ్యూసర్‌ని బెదిరించి పాటలో హీరోయిన్‌తో  డ్యాన్స్‌ చేయాలని కోరాడు. అంతేకాదు  కొరియోగ్రాఫర్‌తో కొన్ని అసభ్యకర స్టెప్స్‌ని చేర్పించి, తాకరాని చోట తాకడం లాంటివి చేశాడు. నా సహనం దెబ్బతింది. ఇక నా వల్ల కాదని సెట్స్‌లో నుంచి బయటకు వచ్చేశాను. ప్రొడ్యూసర్‌ కూడా నా ఇబ్బందిని అర్థం చేసుకోకుండా నా మీద అసహనం ప్రదర్శించడం నన్ను షాక్‌కి గురి చేసింది’’ అని  ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. 

‘చాక్‌లెట్‌’.. ఓ చేదు అనుభవం
ముందుగా నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన తనుశ్రీ దత్తా ఆ తర్వాత ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘చాక్‌లెట్‌’ చిత్రదర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. తనుశ్రీ చెప్పిన ప్రకారం ఆ రోజు షూటింగ్‌లో తనుశ్రీతో పాటు సునీల్‌ శెట్టి, ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా ఉన్నారు. ఓ ప్రత్యేక పాట చిత్రీకరిస్తున్నారు. పాట అంటే సహజంగానే కథానాయికలకు కురచ దుస్తులు ఉంటాయి. కెమెరా ముందు ఆ దుస్తులతో నటించినా కెమెరా వెనక మాత్రం లొకేషన్‌లో టవల్‌ కప్పుకోవడమో, ఓవర్‌ కోట్‌ వేసుకోవడమో చేస్తుంటారు నాయికలు. తనుశ్రీ కూడా అలానే కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగిందనే విషయం గురించి తనుశ్రీ చెబుతూ– ‘‘ఇర్ఫాన్‌తో వివేక్‌ అగ్నిహోత్రి క్లోజప్‌ షాట్‌ తీయడానికి రెడీ అయ్యాడు. ఇర్ఫాన్‌ తన ఎదురుగా ఏదో ఉన్నట్లుగా చూస్తూ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలి. ఆ షాట్‌కి నేను అక్కర్లేదు. అయినప్పటికీ.. వివేక్‌ అగ్నిహోత్రి ‘వెళ్లు.. బట్టలు (టవల్‌ లేక కోట్‌) తీసేసి ఇర్ఫాన్‌ ముందు డ్యాన్స్‌ చెయ్‌. ఇర్ఫాన్‌కి ‘క్యూస్‌’ (సీన్‌లో ఆర్టిస్ట్‌ లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుని ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడం కోసం కెమెరా వెనక ఎవరో ఒకరు ఉండి అతనికి లీడ్‌ ఇవ్వడం) ఇవ్వు’ అన్నాడు. అసలు అలా అవసరం లేదు. వెంటనే ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘నాకు యాక్టింగ్‌ వచ్చు. నేను ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడం కోసం తను కోట్‌ తీసేసి, నా ముందు డ్యాన్స్‌ చేయనవసరంలేదు’ అన్నారు. అలాగే సునీల్‌ శెట్టి ‘ఇర్ఫాన్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలంటే పోనీ నేను ‘క్యూస్‌’ ఇవ్వనా’ అన్నారు. ఇలా ఇర్ఫాన్, సునీల్‌ ముందుకు రావడంతో బాలీవుడ్‌లో ఇలాంటివాళ్లే (వివేక్‌ అగ్నిహోత్రి) ఉంటారనే నా భ్రమ తొలగిపోయింది. మంచివాళ్లూ ఉంటారు’’ అన్నారు తనుశ్రీ దత్తా.
ఎప్పుడో తనకెదురైన చేదు అనుభవాల గురించి తనుశ్రీ దత్తా ఇప్పుడు మాట్లాడటం పై కొందరు ‘అప్పుడు ఎందుకు చెప్పలేదు’ అని విమర్శిస్తున్నారు. అయితే తనుశ్రీ అప్పుడు కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఎవరూ ఖాతరు చేయలేదు. పైగా ఈ పదేళ్లల్లో మీడియా ఎంత ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సంగతలా ఉంచితే... మరి పరిశ్రమలో తనకెదురైన రెండు చేదు అనుభవాల వల్ల తనుశ్రీ విరక్తి చెందారో లేక ఆమెకు అవకాశాలు లేకుండా చేశారో ఏమో... ‘అపార్ట్‌మెంట్‌’ (2010లో విడుదల) తర్వాత ఆమె టోటల్‌గా సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. అప్పటి నుంచి యూఎస్‌లోనే ఉంటున్నారు. మరి.. నానా పటేకర్‌ గురించి ఆమె ఎక్కడ మాట్లాడారు అంటే..

ఇటీవల ముంబై వచ్చిన తనుశ్రీ దత్తాను ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో నానా గురించి మాట్లాడారట. ఆ వివాదం చానల్‌ నుంచి పత్రికలు, సోషల్‌ మీడియా వరకూ పాకింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్‌ టాపిక్‌. ఎవరు అడిగినా కాదనకుండా తనుశ్రీ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూల్లోని సారాంశం ఇలా ఉంది.‘‘అప్పటితో పోల్చితే ఇండస్ట్రీలో ఎన్నో మెరుగైన మార్పులు వచ్చాయి. అయితే కొందరు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే నడుస్తున్నారు. ఇలాంటి సమస్యల గురించి స్త్రీ బహిరంగంగా  మాట్లాడితే ‘ఆరోపించడం’ అంటారు. అదే పురుషుడు అయితే తన సమస్యను పంచుకోవడం అంటారు. అప్పుడూ అంతే. ఇప్పుడూ అంతే. ఈ పద్ధతిలో ఏ మార్పూ లేదు. వాస్తవానికి ఇలాంటివి (వేధింపులు) అన్ని చోట్లా జరుగుతున్నాయి. అయితే స్త్రీ చెబితే ఒకలా, పురుషుడు చెబితే మరోలా అనే సమాజంలోని ఈ ద్వంద్వవైఖరి వల్లే ఇంకా ఎన్నో మాటలు వచ్చిన గొంతులు కూడా మౌనంగానే ఉన్నాయి. అంతెందుకు? నేను ఇప్పుడు ఇండస్ట్రీలో భాగం కానందు వల్లే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నానేమో. 2008లో ఇదే విషయం గురించి  గొంతు పోయేట్లు మొత్తుకున్నాను. ఏమైంది? ఇండస్ట్రీలో తనుశ్రీ దత్తా అనే పేరు వినిపించకుండా పోయింది. అయినా ఈ ఒక్క సంఘటన వల్లే నేను ఇండస్ట్రీని వదిలి వెళ్లలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆఫర్స్‌ వచ్చాయి. చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. కానీ పబ్లిక్‌గా మాట్లాడలేదు. ఇండస్ట్రీ ఇలాంటి పనులను చేసేవాళ్లను నిలదీయదు. అలాగని ఏ హీరోయిన్‌ అయితే బహిరంగంగా మాట్లాడిందో ఆ హీరోయిన్‌తో కూడా పని చేయడం ఆపదు’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తనుశ్రీ. ప్రస్తుతం కంప్లైంట్‌ ఇవ్వడం లాంటివి ఏదైనా చేస్తారా? అని అడగ్గా – ‘‘ఏం చేయాలో అవన్నీ ఆ రోజుల్లోనే చేసేశా. కంప్లైంట్‌ చేయడంతో నా మీద, నా కుటుంబం మీద వేధింపులు ఎక్కువయ్యాయి. మన దేశంలో చట్టాలన్నీ నిందితుడికి మద్దతుగా ఉన్నాయి తప్పిస్తే బాధితులకు మద్దతుగా లేవు. అలాగే ఫిర్యాదు స్వీకరించిన తర్వాత తుది తీర్పుకి ఎక్కువ సమయం తీసుకోకూడదు. న్యాయం జరిగే సమయాన్ని తగ్గించకపోతే మళ్లీ బాధితులకు మరో రకమైన వేధింపులు మొదలవుతాయి’’ అని పేర్కొన్నారు.

ఎప్పుడూ బాధితులు సౌండ్‌ చేస్తారు. నిందితులు సైలెంట్‌గా ఉంటారు. విషయాన్ని తేలికపరచడానికి ఓ నవ్వుతో కొట్టిపారేస్తారు కూడా. తనుశ్రీ ఆరోపణలను నానా పటేకర్‌ అలానే తీసి పారేశారు. ఒకవైపు సోషల్‌ మీడియా, టీవీల్లో నానా పటేకర్‌ గురించి సీరియస్‌ డిస్కషన్‌లు జరుగుతుంటే ఆయన మాత్రం నవ్వుతూ కొట్టిపారేశారు. ఈ విషయమై ఆయన్ను అడగ్గా – ‘‘లైంగికంగా వేధించడమంటే ఏంటో చెప్పండి? సెట్లో సుమారు 100 నుంచి 150మంది సభ్యులున్నారు. తనతో ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే వాళ్ల కంట్లో పడకుండా ఉండదు కదా? నేను లీగల్‌గా ప్రొసీడ్‌ అవుతా’’ అని పేర్కొన్నారు. మరోవైపు ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ దర్శకుడు రాకేశ్‌ సారంగ్, నృత్యదర్శకుడు గణేశ్‌ ఆచార్య నానాని వెనకేసుకొచ్చారు.    ఒక ఘటన జరిగినప్పుడు రెండు పక్షాల వాళ్లూ తమకెదురైన అనుభవాలను పంచుకుంటారు. ఒకరు తప్పని.. ఒకరు ఒప్పు అని అనలేం. అలాంటప్పుడు ఆ ఇష్యూకి సంబంధం లేని మూడో వ్యక్తి చెప్పే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. తనుశ్రీ దత్తా, నానా విషయంలో మూడో వ్యక్తి ఎవరంటే బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ ‘జానిస్‌ సీక్వెరా’. తనుశ్రీ వైపే న్యాయం ఉందని జానిస్‌ ట్వీట్‌ చేయడం, ఆ ట్వీట్‌ని సమర్థిస్తూ పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఆ ట్వీట్స్‌ ఏంటంటే..
పని చేసే చోట వేధింపులు, బెదిరింపులు లేకుండా ఉండాలని కోరుకోవడం అందరి హక్కు. అలాంటివాటి గురించి ఇలాంటి (తనుశ్రీ) ధైర్యవంతులు బహిరంగంగా మాట్లాడటం ఇతరులకూ ఆదర్శం. 
– ట్వింకిల్‌ ఖన్నా

నాతో పాటు నటించిన ఆర్టిస్టులు (మేల్, ఫిమేల్‌) చాలామంది వేధింపులకు గురయ్యారు. వాటి గురించి చెప్పుకునే హక్కు వాళ్లకు ఉంటుంది. వాళ్లను ఏవేవో ప్రశ్నలు అడిగితే బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది? నేను తనుశ్రీ, జానిస్‌ సీక్వెరాలను నమ్ముతున్నా. జానిస్‌ నా ఫ్రెండ్‌. తను అబద్ధం చెప్పదు.  
– సోనమ్‌ కపూర్‌

పదేళ్ల క్రితం తనుశ్రీ దత్తా ఎందుకు మౌనంగా ఉందంటే.. కెరీర్‌ గురించిన భయం ఉండి ఉంటుంది. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి కానీ జరిగిన విషయాన్ని బయటపెట్టాలన్న తన ఉద్దేశాన్ని కాదు.
– ఫర్హాన్‌ అక్తర్‌
ప్రియాంకా చోప్రా, పరిణీతి చోప్రా వంటి తారలు కూడా తనుశ్రీ దత్తాకి మద్దతుగా ట్వీట్‌ చేశారు. 

ఆ వాతావరణం వస్తుందా?
హాలీవుడ్‌లో నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌ తనను లైంగికంగా వేధించాడని నటి యాష్లే జుడ్‌ బహిరంగంగా చెప్పాక ‘మీ టూ’ ఉద్యమం మొదలైంది. అతన్ని హాలీవుడ్‌లో చాలావరకూ పక్కన పెట్టారు. మరి.. తనుశ్రీకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఈ ‘నానా గొడవ’కు ఎలాంటి ముగింపు దొరుకుతుంది? అనేది వేచి చూడాల్సిందే.  కొందరు తారలు సినిమా పరిశ్రమలో సమస్య ఉందని అంటున్నారు. మరి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసుకునే వాతావరణం స్త్రీలకు వస్తుందా? కాలమే చెప్పాలి.

కొట్టిపడేయకూడదు
ఎవరైనా స్త్రీ లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతుంటే వినండి. మరణానికి దగ్గరగా ఉన్న సమయంలో కూడా ‘50 ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది’ అని చెప్పినా తేలికగా తీసుకోకుండా వినాలి. ఈ విషయమేదో అప్పుడే మాట్లాడొచ్చుగా? అని కొట్టి పారేశారంటే అప్పుడు సమస్య వాళ్లలో ఉన్నట్లు. ఒక అమ్మాయి లైంగికంగా వేధింపుల గురించి పబ్లిక్‌ ప్లాట్‌ఫార్మ్స్‌లో చర్చలు జరపడం అంటేనే అది వాళ్లకు  టార్చర్‌. కొందరు మూర్ఖులు ‘పబ్లిసిటీ కోసం ఇదంతా’ అని కామెంట్‌ చేయడం అమానుషం. బాధితులు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనే అనుమానం రావడం సహజం. ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొన్నవాళ్లు అమాయకులైతే బయటపడతారు కదా.
 – నటుడు సిద్ధార్థ్‌

తనుశ్రీ ఆరోపణలపై ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’లో నటించిన రిమ్మీ  సేన్‌ పెదవి విప్పారు. ‘‘కో–స్టార్‌గా నానా పటేకర్‌ గుడ్‌. నానా చాలా ఒంటరిగా ఉండేవారు. అందువల్లే కొన్ని సార్లు చిరాకు పడుతుండేవారు. ఆయనకు షార్ట్‌ టెంపర్‌ ఉంది. అయితే లైంగికంగా వేధించేవాడు కాదని నా అభిప్రాయం. ఒంటరిగా ఉండేవాడు కాబట్టే స్త్రీ సాన్నిహిత్యం కోరుకునేవాడేమో. నేనైతే ఎటువంటి ఇబ్బంది పడలేదు. కూతురిలా ట్రీట్‌ చేశారు. అతని వాదన కూడా విని  నిర్ణయానికి వస్తే మంచిదేమో. తనుశ్రీ చాలా నిజాయితీ గల అమ్మాయి. అనవసరమైన ఫేమ్‌ కోరుకోదు. అక్కడ ఏం జరక్కుండా తను ఆరోపించదు. ఆ పాట షూటింగ్‌ సందర్భంలో నేనక్కడ లేను. ఏం జరిగిందో చెప్పలేను’’ అని అన్నారు.

అప్పుడే చెప్పాల్సింది!
‘‘నానా పటేకర్‌ వల్ల ఇబ్బంది పడ్డానని ఇప్పుడు మాట్లాడటం కన్నా.. అప్పుడే ఆ విషయాన్ని బయటపెడితే అతని బండారం బయటపడేది. ఆ రోజు నుండి అందరూ ఆయనలో ఉన్న ఇంకో కోణం గురించి మాట్లాడుకునేవారు. అలాగే ఈ తొమ్మిదేళ్లలో నానా పటేకర్‌ వల్ల ఇంకొంతమంది ఇబ్బంది పడి ఉండేవాళ్లు కాదేమో. నేను చాలాసార్లు చెప్పాను.. ఇక్కడ  బలవంతంగా ఎవరూ ఏమీ చేయరని. అలా ఎవరైనా వేధించి నప్పుడు స్త్రీలకు అండగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం కూడా స్త్రీని సమర్థిస్తుంది. నేను ఒక విషయం చెబుతాను. మనం వెళ్లే ప్లేస్‌ కరెక్టేనా, మనం మాట్లాడే మనిషి ఎటువంటి వాడు? అనే స్పృహ ఆడవాళ్లకు ఉండాలి. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కూడా నువ్వు ఈ పని చేస్తేనే నీకు వేషం ఇస్తా అనేవాళ్లు ఉన్నారు. అలా అన్న  రోజే బయటికొచ్చి ఆ విషయాన్ని చెప్పాలి తప్ప అవకాశం కోసం ఆ రోజు అన్నింటికీ సరే అని ఆ పని అయ్యాక ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. చిత్ర పరిశ్రమ నుంచి రోజువారీ పని చేసుకునే స్త్రీల దాకా అందరికీ సమస్యలుంటాయి. వాటినుండి ఎలా తప్పించుకోవాలి అనేది మన తెలివి మీదే ఉంటుంది.        
 – జీవిత
– డి.జి. భవాని గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement