బాలీవుడ్కి సినిమా చూపిస్తున్న మాఫియా | bollywood Film industry relation with under world Mafia | Sakshi
Sakshi News home page

బాలీవుడ్కి సినిమా చూపిస్తున్న మాఫియా

Published Tue, Oct 27 2015 10:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్కి సినిమా చూపిస్తున్న మాఫియా - Sakshi

బాలీవుడ్కి సినిమా చూపిస్తున్న మాఫియా

బాలీవుడ్ ఇండస్ట్రీ, భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న సినీరంగాల్లో ఒకటి. లోబడ్జెట్ హిట్ చిత్రాల నుంచి వందల కోట్లు కొల్లగొట్టగలిగే బడా బడా స్టార్ హీరోల వరకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు బాలీవుడ్లో చేతులు మారతాయి. అందుకే ముంబై మాఫియా కూడా బాలీవుడ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. సినిమాలకు ఫైనాన్స్ చేయడం దగ్గర నుంచి చాలావరకు సినీ రంగంలో తలెత్తున్న వివాదాలను సెటిల్ చేయటం, సినీ తారలతో ప్రేమాయణాలు కొనసాగించటం వరకు బాలీవుడ్- మాఫియాది విడదీయరాని సంబంధం. తాజాగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్ట్తో మరోసారి బాలీవుడ్ ఉలిక్కిపడింది. రాజన్తో ప్రేమ వ్యవహారాలు నడిపిన అందాలభామలతో పాటు రాజన్ సాయంతో సినిమాల్లో ఎదిగిన వారు టెన్షన్ పడుతున్నారు.

బాలీవుడ్తో ముంబై మాఫియా సంబంధాలు ఇప్పటివేం కాదు. ఇండస్ట్రీ కమర్షియల్గా బలపడుతున్న సమయం నుంచే ఇవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దావుద్ నేరసామ్రాజ్యం విస్తరించిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు తమకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోలు దావుద్తో కలిసిన దిగిన ఫొటోలు కూడా బయటికి రాగా, సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలుపాలయ్యాడు. స్టార్ హీరోలు మాఫియా డాన్లతో సంబంధాలు కొనసాగించటానికి చాలా కారణాలే ఉన్నాయి. తమ సినిమాలకు ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా అండగా ఉంటారనే ఆలోచన కొందరిదైతే, వాళ్లతో సరిగా లేకపోతే ఏవైనా ఇబ్బందులు కలిగిస్తారేమో అన్న భయం మరికొందరిది.

కేవలం హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు కూడా అండర్ వరల్డ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ లిస్టులో అందరికంటే ముందున్న హీరోయిన్ సోనా. హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకోకపోయినా.. మాఫియా డాన్ హాజీ మస్తాన్తో ఉన్న సంబంధాల కారణంగా సోనా మంచి పాపులారిటీ సాధించింది. తరువాత తరంలో కూడా ఈ సంబంధాలు కొనసాగాయి. బోల్డ్ యాక్ట్రెస్ మందాకినికి కూడా మాఫియాతో మంచి సంబంధాలే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీంతో కలిసి చాలా ప్రైవేట్ ఫంక్షన్స్లో కనిపించిన ఈ పిల్లికళ్ల సుందరి.. తర్వాత అతడితో కలిసి దుబాయ్లో సెటిల్ అయ్యింది. కొంత కాలం తరువాత దావూద్కు దూరమైన ఈబోల్డ్ బ్యూటీ.. 'మేం జస్ట్ ఫ్రెండ్స్' అంటూ తమ రిలేషన్కు గుడ్ బై చెప్పేసింది. మరో హాట్ బ్యూటీ మమతా కులకర్ణి కూడా విక్కీ గోస్వామితో పాటు ఛోటా రాజన్తో  సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది. ఈ రిలేషన్ల వల్లే మమతకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయన్న టాక్ కూడా ఉంది.

ఈ జనరేషన్లో బాలీవుడ్ను షేక్ చేసిన మాఫియా రిలేషన్ మోనికా బేడీ- అబూ సలేంలది. నార్త్తో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ భామ, నటనకు గుడ్ బై చెప్పి అబూసలేంతో కలిసి ఫారిన్లో సెటిలైంది. తర్వాత పోర్చుగల్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో మోనికా, అబూ సలేంల ప్రేమ వ్యవహారం మరోసారి బాలీవుడ్, మాఫియా సంబంధాలను తెరమీదకు తీసుకువచ్చింది. వీళ్లే కాదు ఈ తరం హీరోయిన్లతో కూడా మాఫియా సంబంధాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ప్రీతీ జింటా, నెస్ వాడియాల వివాదంలో మాఫియా బెదిరింపులకు దిగిందంటూ వచ్చిన వార్తలతో ప్రీతి జింటాకు మాఫియా డాన్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపించాయి.

తెర వెనక కథలు నడపటమే కాదు. బాలీవుడ్లో ముంబై మాఫియా ప్రత్యక్ష దాడులకు దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని చాలామంది హీరోలు, నిర్మాతల సినిమాలను ఓవర్ సీస్లో రిలీజ్ కాకుండా మాఫియా అడ్డుకుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది స్టార్లు మాఫియాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక తాజా ఉదాహరణల విషయానికి వస్తే, హృతిక్ రోషన్ హీరోగా పరిచయం అయిన 'కహోనా ప్యార్ హై' సినిమా ఓవర్ సీస్ రైట్స్ విషయంలో తలెత్తిన వివాదం రాకేష్ రోషన్పై కాల్పులు జరిపేవరకు వెళ్లింది. కేవలం మాఫియా చెప్పు చేతల్లో ఉండటం లేదన్న ఒక్క కారణంతో బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్, టీ - సిరీస్ అధినేత గుల్షాన్ కుమార్ను హత్య చేసింది మాఫియా.

ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మంది హీరోలకు, హీరోయిన్లకు, నిర్మాతలకు ముంబై అండర్ వరల్డ్‌ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వాదన ఉంది. వీటిలో నిజానిజాలెంతో తెలియదు గానీ, అరెస్ట్ అయిన ఛోటారాజన్ నోరువిప్పితే మాత్రం బాలీవుడ్ లో చాలా మంది పేర్లు బయటి వస్తాయన్నది ఎవరూ కాదనలేని నిజం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement