
గతంలో జుయ్‌మంటూ మన పక్కనుంచి ఒక బైక్ వెళితే అది ‘ఆర్‌ఎక్స్100’ సౌండ్ అనుకునేంత గొప్పగా చెప్పుకునేవారు ఆ బైక్ గురించి. దాని స్పీడు అలా ఉండేది మరి. ఆ బైక్ పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టారు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడు ఆ బైక్ స్పీడ్ కంటే మనోడు సాధించిన హిట్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇంకా పెద్ద సౌండ్‌తో వినిపించింది. ఆ మాత్రం సౌండ్ చేస్తే చాలు చాన్సులు డోర్ దగ్గరికి వచ్చేస్తాయ్. ఇప్పటికి అజయ్‌కి వచ్చిన అవకాశాల లెక్క దాదాపు 15. మంచి మంచి ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి అజయ్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి నిర్మాతలు సంప్రదించారు.
విశేషం ఏంటంటే... తెలుగులో సాధించిన హిట్ సౌండ్ పరభాషల వారికీ వినిపించింది. బాలీవుడ్ నుంచి ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాతలు అనురాగ్ కశ్యప్, మధు మంతెనలతో ఓ సినిమా గురించి మంతనాలు జరుగుతున్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి కూడా అజయ్‌కి ఖబర్ వచ్చింది. ప్రముఖ తమిళ హీరో ధనుష్‌తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందని టాక్. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్పీడు స్పీడులే అంటూ వరుస సినిమాలతో అజయ్ రయ్‌మని దూసుకెళ్లే చాన్స్ కనిపిస్తోంది.