
సీనియర్ నటుడి బంగ్లాకు బాంబు బెదిరింపు
సీనియర్ నటుడు, దర్శకనిర్మాత, నటుడు శింబు తండ్రి టీ.రాజేందర్‌కు చెందిన బంగ్లాకు బాంబు బెదిరింపు రావడంతో మరోసారి పోలీసు వర్గాల్లో కలకలం రేగింది.
చెన్నై: సీనియర్ నటుడు, దర్శకనిర్మాత, నటుడు శింబు తండ్రి టీ రాజేందర్‌కు చెందిన బంగ్లాలో బాంబు పెట్టినట్టు బెదిరింపు రావడంతో మరోసారి పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటికే శింబు బీప్ సాంగ్ వివాదంలో తలనొప్పికి గురవుతున్న పోలీసులు తాజాగా ఈ బాంబు బెదిరింపు కాల్‌తో అలర్ట్ అయ్యారు.
టీ రాజేందర్‌కు స్థానిక పోరూర్‌లోని శెట్టియార్ అగరం ప్రాంతంలో పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో బాంబు ఉన్నట్టు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్, కంట్రోల్ రూమ్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అంబులెన్స్ నిర్వాహకులు మధువాయిల్ పోలీసులకు సమాచారం అందించారు. మధురవాయిల్ పోలీసులు వెంటనే పోరూర్‌లోని టీ.రాజేందర్ బంగ్లాకు వెళ్లి క్షుణంగా తనిఖీలు జరిపారు. అయితే అక్కడ బాంబులు దొరకలేదు. దీంతో పోలీసులు ఆ ఫోన్ నంబర్‌కు తిరిగి ఫోన్ చేశారు. ఒక మహిళ ఫోన్‌ను తీయడంతో ఆమె మగ గొంతుతో బాంబు బెదిరింపు కాల్ చేసినట్టు నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఆమె కోసం గాలిస్తున్నారు. ఇటీవల శింబు బీప్ సాంగ్ మహిళా సంఘాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసిన నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.