తమిళ్ సూపర్ స్టార్ అజిత్, అతిలోక సుందరి శ్రీదేవికి మాట ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు. అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ తమిళంలో వరుసగా రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి హిందీలో సంచలన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఇందులో అమితాబచ్చన్ నటించిన పాత్రలో తమిళంలో అజిత్ నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం చేస్తున్న సమయంలోనే అజిత్‌తో పరిచయం ఏర్పడింది. . అప్పుడు శ్రీదేవి తాను నిర్మించబోయే తమిళ చిత్రంలో నటించాలని అజిత్‌ను కోరారు. అప్పుడు ఆయన కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చారు. శ్రీదేవికిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయనే ముందుకు వచ్చారు. నన్ను పిలిచి సినిమా చేద్దాం అని చెప్పారన్నా’రు బోనీకపూర్. అంతేకాక పింక్ చిత్రంతో పాటు అజిత్ హీరోగా మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు బోనీకపూర్. ఈ ఏడాది జూలైలో ఆ చిత్రాన్ని ప్రారంభిస్తామని.. 2020లో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
‘పింక్’ రీమేక్‌కు యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను నటి శ్రద్ధాశ్రీనాధ్ పోషిస్తుండగా.. మరో ముఖ్య పాత్రను రంగరాజ్ పాండే చేయనున్నారు. విలన్ పాత్రలో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ నటించనున్నారని బోనీ కపూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment