చెన్నై : హీరో అజిత్ సినిమా పరంగానూ, వ్యక్తిగతంగానూ భిన్నమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పనేంటో తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం ఆయనది. తనకు సంబంధం లేని ఏ విషయంలోనూ తల దూర్చరు. ఇంకా చెప్పాలంటే వివాదాలకు దూరంగా ఉండే అరుదైన నటుడు అజిత్. కాగా ప్రస్తుతం అజిత్ నటించిన నేర్కొండ పార్వై చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 8న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయనకు 59వ చిత్రం అన్నది గమనార్హం. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అమితాబ్‌బచ్చన్ పోషించిన పాత్రలో అజిత్ నుటించగా ఆయనకు జంటగా నటి విద్యాబాలన్ నటించింది. ఇక హిందీలో తాప్సీ పాత్రను తమిళంలో నటి శ్రద్ధాశ్రీనాథ్ పోషించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించారు. ఈయన సోమవారం ట్విట్టర్‌లో ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
‘అజిత్ 60వ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో నేను నిర్మించనున్నాను. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇది రేస్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుంది. ఇందులో అజిత్ బైక్ రేస్‌లో పాల్గొనాలని తపించే రేసర్‌గా నటించనున్నారు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. విశేషం ఏమిటంటే నటుడు అజిత్ నటనలోనే కాకుండా ఫోటోగ్రఫీ, బిరియానీ లాంటి వంటలు చేయడంలోనూ, బైక్ రేసింగ్‌లోనూ ఆసక్తి కలిగిన వ్యక్తి. ఈయన ఇంతకు ముందే జిల్లా స్థాయి బైక్ రేస్‌లో పాల్గొన్నారు కూడా. కాగా తాజాగా అలాంటి పాత్రనే చిత్రంలో పోషించనున్నారన్నమాట.
అజిత్‌కు కూతురిగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కల నెరవేరనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. శ్రీదేవి పుట్టింది తమిళనాడులోనేనన్న విషయం తెలిసిందే. కాగా ఆమె తన కూతురు జాన్వీని తమిళంలో కథానాయకిగా పరిచయం చేయాలని ఆశ పడింది. అది తీరకుండానే హఠాన్మరణం పొందింది. అయితే శ్రీదేవి కలను ఆమె కూతును జాన్వీ నిజం చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాతగా కోలీవుడ్‌కు ఎంటర్ అయ్యి అజిత్ హీరోగా నేర్కొండ పార్వై చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 8న తెరపైకి రానుంది. కాగా వెంటనే అజిత్‌తో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో అజిత్‌కు కూతురిగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటించనున్నట్లు తాజా సమాచారం. ఇదే నిజం అయితే జాన్వీ తన తల్లి కలను నిజం చేయబోతోందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment