
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్‌తో జరిగిన డిబేట్‌లో ఆయనను కొంత డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.
దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్‌రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్‌ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.
కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్‌లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment