
రవీందర్ రెడ్డి, బాలకృష్ణ, బోయపాటి శ్రీను
‘సింహా’(2010), ‘లెజెండ్’(2014) చిత్రాల్లో బాలకృష్ణ మాస్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ రెండు చిత్రాలు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే తెరకెక్కాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
ఈ ఏడాది డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది వేసవి చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘బోయపాటి శ్రీను ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఇందులో బాలకృష్ణ మాస్ లుక్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ ప్రధాన సమస్యకు కొన్ని కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది.