
బ్రహ్మానందం హీరోగా మూడడుగుల బుల్లెట్టు
గుండ్రని బంతిలా ఉంటారు బ్రహ్మానందం. ప్రత్యేకించి ఆయన కామెడీ చేయనవసరం లేదు. అలా కనిపిస్తే చాలు, జనాలు ఇలా నవ్వేస్తారు. గతంలో రేలంగి, రాజబాబు తెరపై కనిపించగానే... ప్రేక్షకుల పెదవులపై నవ్వులు విరబూసేవి. ఇప్పుడు బ్రహ్మానందం విషయంలో కూడా అలానే జరుగుతోంది. దటీజ్ బ్రహ్మానందం. దాదాపు మూడు దశాబ్దాలైంది ఆయన తెరకు పరిచయమై. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ సూపర్‌స్టార్ కమెడియన్‌గా అగ్ర పథాన బుల్లెట్‌లా దూసుకుపోతున్నారు బ్రహ్మానందం. అందుకే... ఆ ఇమేజ్‌కి తగ్గట్లుగా బ్రహ్మానందం హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి ‘మూడడుగుల బుల్లెట్’ అని నామకరణం చేసినట్లున్నారు.
మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో బ్రహ్మానందం పాత్ర ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంటుందట. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైందని వినికిడి. ఈ సినిమా ద్వారా ఓ రచయిత దర్శకునిగా పరిచయం అవుతున్నట్లు తెలిసింది. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానుంది. ఈ సినిమాకు సంబంధించిన దర్శక, నిర్మాతలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి. పవన్‌కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’లో ‘ఆరడుగుల బుల్లెట్’ పాట విపరీతంగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో బ్రహ్మానందం ‘మూడడుగుల బుల్లెట్’ అనే టైటిల్‌తో సినిమా చేయడం ఫిలిమ్‌నగర్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది.