అమెరికాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ షూటింగ్
కమల్ హాసన్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న ‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగు జోరుగా సాగుతోంది. దీనికోసం బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారట. వీళ్లిద్దరివీ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలని, అమెరికాలో కొనసాగుతున్న షూటింగులో వీళ్లిద్దరూ పాల్గొంటున్నారని సినిమా వర్గాలు తెలిపాయి. వాళ్ల పాత్రల చిత్రీకరణతో ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ పూర్తయిందని, వాళ్ల పాత్రల షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్తారని చెప్పారు.
దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర పోషించిన కమల్.. అదే పాత్రను ప్రధాన పాత్రగా తీసుకుని దానికి సీక్వెల్లా ఈ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగుతో కూడా బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో కమల్ భార్య పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల కుమార్తెగా కమల్ కూతురు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. సినిమాకు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే, డిసెంబర్ 1న సినిమా విడుదలవుతుంది.