బావ నన్ను ఒక్క చాన్స్ అడిగారు
మా బావ అజిత్ ఒక చాన్స్ ఇప్పించమని నన్ను అడిగారు అని ఆయన మరదలు, నటి షాలిని చెల్లెలు షామిలి అన్నారు. అజిత్ ఏమిటీ షామిలిని అవకాశం అడగడం ఏమిటి? కాస్త విడ్డూరంగా ఉంది కదూ! ఆ మతలబు ఏమిటో చూద్దామా. షామిలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం అని అనుకోవడం లేదు. కారణం బాల నటిగానే అబ్బుర పరచిన లిటిల్‌స్టార్ తాజాగా కథానాయకి అవతారమెత్తుతున్న షామిలి. అయితే ఇంతకు ముందే తెలుగులో ఓయ్ అంటూ కథానాయకిగా పలకరించి సుమారు ఐదేళ్ల తరువాత తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో కథానాయకిగా మూడు చిత్రాల్లో నటిస్తూ నటనకు అంకితం అయిన షామిలితో చిన్న భేటీ...
ప్ర: కథానాయికిగా తెలుగు చిత్రంలో మెరిసి ఆ తరువాత మాయం అయ్యారే?
జ: ఆ మాయం అయిన కాలాన్ని సింగపూర్‌లో విద్యాభ్యాసం కోసం వెచ్చించాను. విస్‌కామ్ పూర్తి చేసిన తరువాత అదే రంగంలో ఉన్నత విద్యను చదవాలని ఆశించాను. కుటుంబ సభ్యులు ఆశీర్వదించి సింగపూర్ పంపారు. అక్కడ చదువు పూర్తి చేసి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చాను.
ప్ర: అంత చదివి మళ్లీ నటనకే వచ్చారే?
జ: నేను బాల తారగానే జాతీయ అవార్డును గెలుచుకున్న నటిని. అదే విధంగా అతి పిన్న వయసులోనే ఇన్‌కంటాక్స్ కట్టిన బాల నటిని బహుశ నేనే అనుకుంటా. అప్పట్లో చదువు కోసం నటనకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నా పలు అవకాశాలు వచ్చాయి. చదువు విజ్ఞానానికి నటన ఇష్టానికి అన్నది నా పాలసీ. చదువు పూర్తి అయింది. ఇప్పుడు ఇష్టమైన నటనకు సిద్ధమయ్యాను. ఇకపై ఎలాంటి కమిట్‌మెంట్స్ లేవు. నటన..నటన..నటనే
ప్ర: మీ కథానాయకులు ధనుష్, విక్రమ్‌ప్రభులో పోలికలు?
జ: అసలు వారిని ఎందుకు పోల్చాలి? వారిద్దరూ కేరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. విక్రమ్‌ప్రభు చెల్లెలు నా క్లాస్‌మేట్. అందువల్ల శివాజీ కుటుంబంతో నాకు కొంచెం సాన్నిహిత్యం ఉంది.
ప్ర: ఏ హీరోతో నటించాలని ఆశిస్తున్నారు?
జ; నటి అన్న తరువాత ఏ హీరోతో అయినా నటించడానికి సిద్ధం కావాలి. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అంకితభావంతో నటించడానికి కృషి చేయాలి.
ప్ర: అత్యంత అభిమానగణం కలిగిన మీ బావ అజిత్ గురించి?
జ: అందరు అభిమానులకు మాదిరిగానే ఆయన నాకు తల నే. మా బావ ఫొటోగ్రఫీ కళ గురించి ఇప్పుడు మీడియా ప్రచారం చేస్తోంది గానీ దీనా చిత్ర షూటింగ్ సమయంలోనే ఆ చిత్ర చాయాగ్రాహకుడు అరవిందన్ ఒక కెమెరాను బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి బావకు ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. ఈ మధ్య కూడా మా కుటుంబ సన్నిహితురాలు సుహాసిని అనే 90 ఏళ్ల బామ్మ ఫొటోను అద్భుతంగా తీశారు. ఇటీవలే శ్రుతిహాసన్, అప్పుకుట్టి తదితర సహ నటీనటులను తన కెమెరాలో బంధించారు. అంతెందుకు నేను నటిస్తున్నానన్న విషయం తెలియగానే వచ్చేసి నాకు ఫొటో సెషన్ చేసే అవకాశం ఇవ్వాలని నన్ను అడిగారు. నా లేటెస్ట్ ఫొటో ఆల్బమ్‌లో మా బావ తీసిన ఫొటోలే ఉన్నాయి.
ప్ర: చివరి ప్రశ్న గ్లామర్ గురించి?
జ: నన్ను చూసి కూడా ఇలాంటి ప్రశ్నా? నా విషయంలో గ్లామర్ చాన్సేలేదు. నాదీ అక్క బాటే.