
ప్రతి పోలీస్ చూడాల్సిన సినిమా
‘‘హీరోలు చాలా బాధ్యతగా ఉంటున్నారు. ఓ సినిమా తేడా కొడితే కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని కథ నచ్చితేనే సినిమా చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్. శర్వానంద్ హీరోగా చంద్రమోహన్ దర్శకత్వంలో ఆయన సమర్పణలో భోగవల్లి బాపినీడు నిర్మించిన ‘రాధ’ శుక్రవారం విడుదలైంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘పోలీస్ అంటే దేవుడనే సందేశాన్ని ‘రాధ’లో వినోదాత్మకంగా చెప్పాం.
‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా’ తరహాలో ఫన్ క్యారెక్టర్‌లో శర్వా అద్భుతంగా నటించాడు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోలీసుల సేవను గుర్తు చేసేలా, వాళ్ల విలువ పెంచేలా ఈ సినిమా తీశాం. ప్రతి పోలీస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రమిది. త్వరలో పోలీసులకు స్పెషల్ షో వేయాలనుకుంటున్నాం. ‘బాహుబలి’ ప్రభంజనంలోనూ మా సినిమాకు తగినన్ని థియేటర్లు లభించాయి. ప్రేక్షకులూ చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అన్నారు.