సల్మాన్.. ఎప్పటిదాకా ఈ రన్... | charu dutt asks salman khan about his running away | Sakshi
Sakshi News home page

సల్మాన్.. ఎప్పటిదాకా ఈ రన్...

Published Fri, May 8 2015 3:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్.. ఎప్పటిదాకా ఈ రన్... - Sakshi

సల్మాన్.. ఎప్పటిదాకా ఈ రన్...

హిట్ అండ్ రన్...హిట్‌కు ఎన్నో కారణాలుండొచ్చు. రక్తంలో మద్యం మత్తు ఎక్కువైతే 'హిట్' జరుగొచ్చు. రక్తంలో మానవత్వం ఆనవాళ్లు లేకపోతే, మదాంధకారం ఎక్కువైతేనే 'రన్'. అవినీతి వ్యవస్థ అండగా నిలుస్తోందన్న విశ్వాసం ఉంటే... అర్థ, అంగబలంతో బయటపడొచ్చని అర్థం చేసుకుంటే 'రన్'... హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మొదటిసారి యాక్సిడెంట్ జరిగిన రోజున 'రన్' (పారిపోయాడు), అవినీతి వ్యవస్థను ఆసరా చేసుకొని గత 13 ఏళ్లుగా 'రన్'....

నేను కూడా 'హిట్ అండ్ రన్'  కేసులో బాధితుడినే. 1998లో నాకు పెళ్లయింది. నా భార్య గర్భవతి. అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ రోజు, మధ్యాహ్నం 2 గంటల సమయం... నేను ఆటోలో వెళ్తున్నాను. సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ చేసిన ఆమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీకి దగ్గరిలోనే ఉన్నాను. ఇంతలో ర్యాష్‌గా వచ్చిన ఓ కారు నేను ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. ఆటో తలకిందులైంది. ఆటో కింద నా కాలు చిక్కుకుపోవడం వల్ల కాలు నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్ సీటులో నుంచి ఓ యువతి, ఆమెతోపాటు ఆమె స్నేహితురాలు దిగారు. కాకతాళీయంగా ఆ యువతి పాలీహిల్‌లో ఉంటున్న ఓ సినీ ప్రముఖుడి కూతురు. నా పరిస్థితిని చూసి వెంటనే ఆ యువతి కారెక్కి పారిపోయింది. నుజ్జునుజ్జయిన నా కాలు నుంచి రక్తం చిమ్ముతోంది. నన్ను చూసిన బాటసారులకు నాకు ఎలా సాయం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో రెండు బలమైన చేతులు వచ్చి నన్ను పసిపిల్లాడిలా ఎత్తుకొని, తన కారులో కూర్చోబెట్టుకున్నాయి. నేను చచ్చిపోతానా? అని ఆ బలమైన చేతుల ఆసామిని అడిగాను. ఏం చావవంటూ భరోసా ఇచ్చాడు. నన్ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి, నా ద్వారా ఇంటి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత ఆ ఆసామి తన దారిన తాను వెళ్లిపోయాడు. నా కాలుకు ఆ రోజంతా ఆపరేషన్ చేశారట. మర్నాడు యాక్సిడెంట్‌కు గురైన ఆటో డ్రైవర్ వచ్చి నన్ను పలకరించాడు. అదృష్టవశాత్తు ఆ యాక్సిడెంట్‌లో ఆయనకు పెద్ద గాయాలేవీ తగల్లేదు. యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ తాను సగమే చూశానని, ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు.

ఆ మర్నాడు నన్ను రక్షించిన ఆ బలమైన ఆసామి నన్ను పలకరించేందుకు వచ్చాడు. అతని పేరు సమారితన్. ఆస్ట్రేలియాలో ఇండియన్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడట. అతని తండ్రి 'హిట్ అండ్ రన్' కేసులో చనిపోతే అంత్యక్రియలకు వచ్చాడట. రెండున్నర నెలల తర్వాత కూడా నేను బెడ్ మీదనే ఉన్నాను. ఆలోగా యాక్సిడెంట్ చేసిన అమ్మాయిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె స్వయంగా ఓ బొకే పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి ఎందుకొచ్చావ్, పోలీసుల దగ్గరికి వెళ్లకపోయావా? అని ప్రశ్నించాను. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. యాక్సిడెంట్ చేసిన రోజున ఎందుకు పారిపోయావ్ అంటే, జనం తిడతారని భయపడి వెళ్లిపోయానంది. క్లుప్తంగా సారీ చెప్పి వెళ్లి పోయింది. ఆ తర్వాత నాకు ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. బోలెడంత డబ్బు ఖర్చయింది. జీవిత బీమా కంపెనీల నుంచి తప్ప మరెక్కడి నుంచి నాకు సాయం అందలేదు. ఈ రోజున కూడా నేను కుంటుతూనే నడుస్తున్నా.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... తాగి కారు నడిపినందుకు కాదు, గుద్దినందుకూ కాదు. సిగ్గులేకుండా, పిరికిపందలా పారిపోయినందుకు. నీవు నేడు, నిన్ను స్టార్‌గా నిలబెట్టిన నీ బాధితుల భూతానికి భయపడిపోతున్నావు. వెన్నెముక లేని సినీ పరిశ్రమ కూడా ఈ రోజు నీ వెనకాల నడుస్తున్నందుకు సిగ్గు పడుతున్నా. ఏదో రోజు మీలో ఎవరో ఒకరు మీ ఇంట్లో ఉన్న వారి కోసం జెల్లీ పాస్టరీస్ కొనేందుకు అమెరిక్ ఎక్స్‌ప్రెస్ బేకరీకి వస్తారు. తిరిగి వెళుతుండగా తాగి కారు నడుపుతున్న సల్మాన్ కారు ఢీకొంటుంది. మీ కాలు కూడా జెల్లీ పాస్టరీలా అవుతుంది. ఆయన మళ్లీ రన్. ఎన్నేళ్లయినా మీరు విరిగిన కాలుతో అలా ఆస్పత్రి వార్డులో డాక్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఏదో పని మీద అటువైపు వచ్చిన సల్మాన్ మిమ్మల్ని గుర్తించడు. ఓ అభిమాని అనుకొని చేతులూపుతూ వెళతారు.
-చారుదత్ ఆచార్య, దర్శకుడు, రచయిత

(చారుదత్ ఆచార్య సినిమా దర్శకుడు, స్క్రిప్ట్, మాటల రచయిత. ఐఎండీబీకి కాంట్రిబ్యూటర్. గత ఏడాది విడుదలైన 'సోనాలీ కేబుల్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'నోటోంకీ సాలా' చిత్రానికి స్క్రీప్లే, మాటలు రాశారు. దమ్ మారో దమ్ తదితర చిత్రాలకు మాటలు రాశారు. ఆయన ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసం నుంచి ఈ భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement