విజయపథాన సల్మాన్ ఖాన్
ముంబై: ఈ ఏడాదంతా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మంచి రోజులే. ఆయన నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇటీవలే విడుదలైన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 2002 నుంచి కార్ యాక్సిడెంట్ కేసులో దోషిగా ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి బయటపడడం మామూలు విజయం కాదు. డిసెంబర్ 27వ తేదీన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్‌కు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవరివ్వగలరు!
కారు యాక్సిడెంట్ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వేరే విషయం. ప్రస్తుతానికి కోర్టు కేసులో విజయం ఆయనదే. అచ్చం ఆయన డిక్టేట్ చేసిన స్క్రిప్ట్‌లాగా ఈ ఏడాది ఆయనకు గడచిపోతోంది.
1990 దశకంలో బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా ముద్రపడిన సల్మాన్ ఖాన్ క్రమక్రమంగా నిజమైన హీరోగా, గుడ్ బాయ్‌గా అభిమానుల మెప్పు సంపాదించడం సాధారణ విషయమేమి కాదు. బాలీవుడ్ కండల వీరుడిగా అస్తమానం అమ్మాయిలతో గొడవ పడడం, మద్యం మత్తులో ఎవరిపై పడితే వారిపై చేయి చేసుకుంటూ మీడియాలో సంచలనం సృష్టిస్తూ కారు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కొని పూర్తిస్థాయి బ్యాడ్ బాయ్‌గా ముద్రపడిన విషయం తెల్సిందే. కారు యాక్సిడెంట్ నుంచి వచ్చిన గుణపాఠమో లేక ఆయన విధేయ మేనేజర్ రేష్మ శెట్టిలాంటి వారి సలహాలు, సూచనలు బుద్ధిగా పాటిస్తూ రావడమో స్పష్టంగా తెలియదుగానీ తనదైన నడతను మార్చుకుంటూ వచ్చి ప్రస్తుతం లక్షలాది అభిమానులకు ప్రేమ పాత్రుడయ్యారు.